ఈ రోజుల్లో జరుగుతున్న కొన్ని నేరాల గురించి వింటుంటే సమాజం ఎటు పోతోందోననే ఆందోళన రాకమానదు. తాజాగా అలాంటి మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం తండ్రిని చంపేశాడో కొడుకు.
ఈ రోజుల్లో మనుషుల ప్రవర్తనల్లో చాలా తేడాలు వస్తున్నాయి. చిన్న విషయాలకే కోపగించుకోవడం ఎక్కువైపోయింది. కొందరి విషయంలోనైతే ఆవేశంలో ఏ అనర్థాలు చేస్తారోననే భయం కలుగుతోంది. ప్రతి చిన్న విషయానికి చేయిజేసుకోవడం, కోపంలో ఎదుటి మనిషిని చంపేయడం కూడా అధికమవుతోంది. ఇలాంటి దారుణాల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. రోజురోజుకీ కుటుంబ విలువలు పాతాళానికి పడిపోతున్నాయి. తండ్రి, తల్లి, కూతురు, కొడుకు, భార్య, పిల్లలు అనేవి పట్టించుకోకుండా తమ పంతం నెగ్గించుకునేందుకు మర్డర్ చేయడానికీ కొందరు వెనుకాడట్లేదు. ఆవేశంలో అయినవారు అని కూడా చూడకుండా కడతేరుస్తున్నారు. చేసిన తప్పునకు జైలు పాలై తమ జీవితాలనూ నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఓ ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, చింతకుప్ప గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి.. తన కొడుకు నితీష్ చేతిలో మృతి చెందాడు. కూలీ పనికి వెళ్లే నితీష్‌కు ఇవ్వాల్సిన డబ్బులను అతడికి కాకుండా తండ్రి సుబ్రమణ్యం చేతికి ఇచ్చాడు యజమాని. దీంతో ఇంటికి వచ్చిన నితీష్.. తన కూలీ డబ్బులు ఇవ్వాలని తండ్రి సుబ్రమణ్యాన్ని అడిగాడు. డబ్బులు ఎందుకు, నీకేం కావాలంటూ తండ్రి మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. దీంతో తండ్రి కుమారుడ్ని ఒక దెబ్బ వేశాడు. కోపంతో ఊగిపోయిన కొడుకు.. పక్కనే ఉన్న చెక్కతో తండ్రి తలపై బలంగా బాదాడు. సుబ్రమణ్యంకు తీవ్ర రక్తస్రావం కావడంతో చుట్టుపక్కల వారు ఆయన్ను రామకుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే ఆయన చనిపోయాడు.