చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో గత ఏడాది క్రితం కోడిగుడ్డు తిని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ కేసులో తాజాగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
బిడ్డలను తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా, అపురూపంగా చూసుకుంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చిన తల్లిదండ్రులు అల్లాడి పోతారు. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. చదువుల నిమిత్తం పిల్లలను అంగన్ వాడీ వంటి స్కూల్స్ కి పంపుతారు. ప్రభుత్వం అక్కడి చదువుకునే పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుంది. అయితే అంగన్ వాడీ బడుల్లో పని చేసే కొందరి నిర్లక్ష్యం కారణం పిల్లల ప్రాణాలు పోతుంటాయి. అంగన్ వాడీలో గుడ్డుతిని ఓ నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై హైకోర్టుగా సంచలన తీర్పు ఇచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏడాది క్రితం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరి 17 కోడిగుడ్డు తిని దీక్షిత అనే నాలుగేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకుంటున్నా ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే మృతిచెందింది. కుళ్లిన కోడిగుడ్డు పెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. అలానే ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు అంగన్వాడీ సిబ్బందిని నిలదీశారు. అలానే తమకు న్యాయం జరగాలని పాప కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.
అయితే అనారోగ్యంతో దీక్షిత మృతి చెందింది అంటూ అంగన్వాడీ సిబ్బంది బుకాయించారు. ఇదే సమయంలో తమకు న్యాయం జరగాలంటూ చిన్నారి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్ ని కూడా ఆశ్రయించారు. దీక్షిత మృతదేహాన్ని ఖననం చేసిన 4 నెలల తర్వాత హెచ్ఆర్సీ తల్లిదండ్రులు ఆదేశం మేరకు పోస్టుమార్టం నిర్వహించారు. పాప మృతికి అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని హెచ్ఆర్సీ నిర్ధారించింది. అలానే దీక్షిత కుటుంబానికి 8 లక్షల పరిహారం ఇవ్వాలంటూ 2023 జనవరి 31న ఆదేశించింది. అయితే హెచ్ఆర్సీ నిర్ణయంపై అంగన్వాడీ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు.. పరిహారం విధించడం సరైనదే అని పిటిషన్‌ను కొట్టివేసింది. హెచ్ఆర్సీ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారి మరణం మానవ తప్పిదంగానే ధర్మాసనం పేర్కొంది. బాధిత కుటుంబానికి రూ .8 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాప తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకూడదని దీక్షిత తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.