ఏపిలో అసెంబ్లీ రెండోరోజు సమావేశాలు రణరంగంగా మారాయి. వ్యక్తిగత దూషణలు విమర్శనలతో నిండిపోయింది. వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు నడిచాయి. అంబటి రాంబాబు, చంద్రబాబు మధ్య వాగ్వాదం నడిచింది. ఇరు వైపుల నుంచి పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఇక సభలో పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని… అంతవరకు సభలో అడుగుపెట్టబోనని అన్నారు. తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. ఏ పరువు కోసమైతే తాను తాపత్రయపడ్డానో… దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తన భార్య గురించి మాట్లాడటంపై పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్ర ఎమోషనల్ అయ్యారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తన అనుభవంలో సభలో ఎన్నో చర్చలను చూశామని… కానీ ఇంత దారుణంగా సభ జరగడాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ముఖం చూడాలనుందని సీఎం జగన్ ఎద్దేవా చేసినప్పటికీ తాను పట్టించుకోలేదని చెప్పారు. తన కుటుంబసభ్యులను రోడ్డుపైకి లాగుతున్నారని అన్నారు.. ఇది మరీ దారుణం అని అన్నారు. ఈ సభలో తాను ఉండలేనని… మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని సభలోని అందరికీ నమస్కారం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటకు వచ్చేశారు.