రేషన్ కార్డులు ఉన్నవారికి, రేషన్ డీలర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్, జూలై నెలల్లో ఇవ్వడం మానేసిన కందిపప్పు కోటాను ఆగస్టు నెల రేషన్ తో కలిపి ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు ఇస్తామన్నా గానీ రేషన్ కార్డుదారులే తీసుకోవడం లేదని.. వారు తీసుకుంటామంటే ఆగస్టు నెలలో ఇస్తామని అన్నారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ లో రేషన్ డీలర్లు, అధికారులతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమావేశమయ్యారు. 322 షాపులు బియ్యం, 246 షాపులు కందిపప్పు సబ్సిడీ ధరలకు అమ్మకానికి పెట్టామని అన్నారు.
ఇక రేషన్ డీలర్ల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. డీలర్లు ప్రతిపాదించిన డిమాండ్లలో 90 శాతానికి పైగా అంగీకారం తెలిపామని అన్నారు. అలానే డీలర్ల కమిషన్ పెంచడానికి కృషి చేస్తామని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు. 2012 నుంచి అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన పథకాలకు ఇవ్వాల్సిన కమిషన్ బకాయిలు ఇస్తామని అన్నారు. ఈ బకాయిల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తామని అన్నారు. గన్నీ బ్యాగులను డీలర్లే ఉంచుకునేలా సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి అన్నారు.
ఇంటింటికీ రేషన్ వాహనాలు ఉన్నా కూడా రేషన్ డీలర్లను తొలగించమని.. రేషన్ వాహనాలు నడవకపోతే డీలర్లతోనే నడిపిస్తామని అన్నారు. గోడౌన్ దగ్గరే షాప్ ఉండేలా కట్టి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామని.. ఈ గోడౌన్ లను ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తామని అన్నారు. బియ్యాన్ని తూకం వేసి రేషన్ డీలర్లకు ఇస్తున్నామని అన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ డీలర్లకు సదుపాయాలు వచ్చేలా చూస్తామని, కేరళ తరహాలోనే రేషన్ డీలర్లకు ఇన్సూరెన్స్, ఎల్ఓసీ ఇస్తామని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు. ఇక కరోనాతో మరణించిన డీలర్లకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని అన్నారు.