ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత చదువు అందాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే పలు పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు.
ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా విద్యార్ధుల చదువు కోసం ఆయన ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం ఎంతగానో తపిస్తున్నారు సీఎం జగన్. విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, మనబడి-నాడు నేడు ఇంకా ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది జగన్ సర్కార్. నేడు విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.
విద్యాశాఖ అధికారులతో పలు కీలక విషయాలు చర్చించారు ముఖ్యమంత్రి జగన్. ఏపీలో పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి నిరంతర ట్రాకింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో, పట్టణాల్లో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్త సమర్ధవంతంగా పనిచేస్తుంది. పిల్లలు స్కూల్ కి రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది.. అయినా కూడా పిల్లలు స్కూల్ కి రాని యెడల తల్లిదండ్రులపై ఆరా తీస్తారు. విద్యార్థులు తప్పని సరిగా పాఠశాలకు వచ్చేలా చూసుకోవాల్సిన బాద్యత అధికారులదే.. ఇంటర్ మీడియట్ వరకు అమ్మఒడి ప్రతి విద్యార్థికి వర్తిస్తుంది. ఇంటర్ పూర్తయిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో విద్యార్థులు లబ్ది పొందవొచ్చు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టెన్త్ పరీక్షలు చాలా పకడ్భందీగా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ప్రశ్నా పత్రాలు లీకులకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. నో మొబైల్ జోన్స్ గా పరీక్షా కేంద్రాలను మార్చి.. ఎలాంటి వారికైనా సెల్ ఫోన్ అనుమతి లేదని అన్నారు. ఇక విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే చేపట్టాలని సీఎం ఆదేశాల మేరకు మే 15 నాటికి అన్నీ సిద్దం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.