కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగులోను మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా అజిత్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ తో ప్రయోగాత్మక సినిమాలు చేసే అజిత్.. గతేడాది వలిమై సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈసారి ‘తెగింపు’ మూవీతో రెడీ అయిపోయాడు. నీర్కొండ పార్వయ్, వలిమై మూవీస్ తర్వాత డైరెక్టర్ హెచ్. వినోద్ తో అజిత్ మూడో సినిమా ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో భారీ బడ్జెట్ తో బోనీకపూర్ ఈ సినిమాని నిర్మించారు. మరి యాక్షన్ ప్యాకడ్ ట్రైలర్ తో అంచనాలు పెంచిన తెగింపు మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
విశాఖపట్నంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకులో RBI రూల్స్ కి మించి రూ. 500 కోట్ల డబ్బు ఎక్సట్రా ఉందని.. బ్యాంకుపై దాడిచేసి ఆ డబ్బు కొట్టేయాలని ఓ ముఠా ప్లాన్ చేస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆ బ్యాంకులో చొరబడి కాల్పులు జరుపుతూ జనాలను బెదిరించే టైంలో.. ఆల్రెడీ అదే బ్యాంకు డబ్బు దోచుకోవడానికి వచ్చిన డార్క్ డెవిల్ అలియాస్ మైఖేల్(అజిత్) ముఠాకి ఎదురు తిరుగుతాడు. కట్ చేస్తే.. అదే ముఠాతో డీల్ కుదుర్చుకొని డబ్బు కొట్టేసే క్రమంలో.. బ్యాంకును పోలీసులు, సెంట్రల్ ఫోర్స్ వాళ్లు చుట్టుముడతారు. మరి మైఖేల్ బ్యాంకు డబ్బు కొట్టేయడం వెనుక ఉద్దేశం ఏంటి? లిమిట్ దాటి బ్యాంకులో డబ్బు ఎందుకు ఉంచారు? దానికోసం మైఖేల్ చేసిన పోరాటం ఏంటి? చివరికి ఏం సందేశం ఇచ్చాడు? అనేది తెరపై చూడాల్సిందే.
హీరో అజిత్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే.. మొదటి నుండి యాక్షన్ తో పాటు డిఫరెంట్ కథలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. పైగా నీర్కొండ పార్వయ్, వలిమై లాంటి హిట్స్ తర్వాత డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబినేషన్ లో చేసిన మూడో సినిమా ఇది. వలిమై లాంటి బిగ్ యాక్షన్ మూవీ తర్వాత.. మళ్లీ అదే కాంబోలో సినిమా వస్తుంది కాబట్టి.. తెగింపుపై ప్రేక్షకులలో మినిమమ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా ట్రైలర్ లో కూడా బ్యాంకు దోపిడీ, కాల్పులు, అజిత్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా అనిపించాయి. అయితే.. ట్రైలర్ చూపించినట్లుగా తెగింపు మూవీ.. ఒక చిన్న పాయింట్ మీదే సాగిందని చెప్పాలి.
చిన్న పాయింట్ తో తెరపైకి వచ్చినా.. తెగింపులో జనాలకు, సమాజానికి అవసరమైన పాయింట్ నే చెప్పాడు దర్శకుడు. అయితే.. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ.. కొత్తగా కూడా ఉందనిపించడం విశేషం. పైగా బ్యాంకు చుట్టూ తిరిగే కథ.. కాబట్టి, బ్యాంకింగ్ రంగంలో ఉండే కుంభకోణాలు, ఎంప్లాయిస్ టార్గెట్స్, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు, వడ్డీలు.. వీటి వెనుక బ్యాంకు వారు చేసే దోపిడీలను వేరే యాంగిల్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. తెగింపు విషయానికి వస్తే.. విశాఖపట్నంలో ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకులో లిమిట్ కి మించి డబ్బు ఉందని తెలిసి ఓ ముఠా దోపిడీకి రెడీ అయ్యే సీన్ తో సినిమా మొదలైంది.
అలా ముఠా బ్యాంకులో చొరబడి కాల్పులు జరిపే క్రమంలో డార్క్ డెవిల్ క్యారెక్టర్ లో హీరో అజిత్ మాస్ ఎంట్రీని ప్లాన్ చేశారు. అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నా.. సీన్ లో అంత యాక్షన్ డిమాండ్ లేదనిపిస్తుంది. బట్.. అజిత్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. అలా హీరో ఫైట్ చేసి.. బ్యాంకులో జనాలను కాపాడతాడేమో అనుకునే టైంలో.. తనుకూడా దోచుకోవడానికే వచ్చానని చెప్పే షాకిస్తాడు. ఆ షాక్ లో నుండి తేరుకునేలోపే పోలీసులు, కాల్పులు, సెంట్రల్ ఫోర్స్.. వార్నింగ్స్, డిమాండ్స్, గవర్నమెంట్ ఇన్వాల్వ్ మెంట్ అన్నీ జరిగిపోతాయి. కానీ.. అల్టిమేట్ గా హీరో డబ్బు ఎలా దోచుకుంటాడు? అనే ఆసక్తిని మెయింటైన్ చేస్తూ.. ఇంటర్వెల్ ట్విస్టు ఇస్తారు.
ఇక్కడ విషయం ఏంటంటే.. బ్యాంకులో ఉన్న ఎక్సట్రా డబ్బు దోచుకోవడానికి ఓ ముఠా, హీరో టీమ్ మాత్రమే కాకుండా మరో టీమ్ ఆల్రెడీ బ్యాంకులో ఉంది.. అనే ట్విస్టు కన్ఫ్యూస్ చేస్తుంది. కానీ.. స్టోరీ అంతా బ్యాంకులో హీరో, బ్యాంకు బయట హీరోయిన్ చేసే యాక్షన్స్ చుట్టూ సాగడం రొటీన్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కి వస్తే.. ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ద్వారా ప్రేక్షకులకు ఓ మంచి మెసేజ్ ఇచ్చే ప్లాన్ చేశారు. బ్యాంకు రంగంలో జరుగుతున్న మోసాలను గుర్తుచేస్తూ.. సన్నివేశాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. కట్ చేస్తే.. అసలు దోపిడీదారులు ఎవరు అనేది రివిల్ చేసే సీక్వెన్స్ ని కాస్త కొత్తగా ప్లాన్ చేశారు. ఫుల్ యాక్షన్ మోడ్ లో ప్రీ క్లైమాక్స్ అదిరిపోతుంది.. కానీ.. ఎండింగ్ అంతగా సంతృప్తి పరచలేదు.
తెగింపు సినిమా హీరో అజిత్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అవుతుంది. కానీ.. కామన్ ఆడియన్స్ కి కొన్ని విషయాల్లోనే కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. బట్.. యాక్షన్ సన్నివేశాలు.. సోషల్ మెసేజ్ కొత్తగా ఉన్నాయి. మిగతా స్టోరీ లైన్.. క్యారెక్టర్ ఎలివేషన్స్ అన్నీ నార్మల్ గా ఉన్నాయి. బ్యాంకు చుట్టూ జరిగే సన్నివేశాలు.. విశాల్ అభిమన్యుడు, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలను, బ్యాంకు హైజాక్ అయిన సీక్వెన్సులు విజయ్ బీస్ట్ మూవీలో మాల్ సీక్వెన్స్ లా అనిపిస్తాయి. కాకపోతే.. డైరెక్టర్ అక్కడక్కడా ట్విస్టులు, యాక్షన్ సీన్స్ తో నింపేశాడు. ఆ విషయంలో ఫ్యాన్స్ కి పండగే. అయితే.. సినిమాలో పాటలకు పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిందని చెప్పలేం కానీ.. ఓకే.
ఇక బ్యాంకులు ప్రజల నుండి డిపాజిట్స్ సేకరించి చేతులెేత్తయడం.. ఆ టైంలో జనాల కష్టాలను చక్కగా ప్రెజెంట్ చేయగలిగాడు దర్శకుడు. ఒక మామూలు లైన్ కి కమర్షియల్ ఎలిమెంట్స్, మెసేజ్ జోడించి తెరపై ఆవిష్కరించాడు. ఇక హీరో అజిత్ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ బాగున్నాయి. స్టైల్, యాక్షన్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. తెగింపు సినిమా అంతా ఒకే రోజులో.. పలు అంశాలను టచ్ చేస్తూ సాగే కథ. డిఫరెంట్ టైమ్స్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఒకటిగా చేసుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. అయితే.. అజిత్ ని ఇంటర్నేషనల్ గ్యాంగస్టర్ గా పరిచయం చేసి.. జనాలకు మెసేజ్ ఇవ్వడం అనేది కామన్ ఆడియన్స్ కి రుచించకపోవచ్చు. క్రైమ్ రిపోర్టర్స్, పోలీసుల ఇన్వాల్వ్ మెంట్ బాగా చూపించారు.
ఇక నీరవ్ షా సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా ఉంది. విజువల్స్ అన్నీ ఫీస్ట్ అనిపించేలా కాప్చర్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో ప్రెజెంట్ చేశారు. హీరోయిన్ మంజు వారియర్, పోలీస్ క్యారెక్టర్ లో సముద్రఖని, అజయ్, విలన్ గా జాన్ కొక్కెన్ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. మొత్తానికి హ్యాట్రిక్ కాంబినేషన్ గా వచ్చిన అజిత్ – వినోద్ ల యాక్షన్ డ్రామా.. మెసేజ్ ఓరియెంటెడ్ గా ఓ వర్గం ప్రేక్షకులను, అజిత్ ఫ్యాన్స్ ని మెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక హీరో అజిత్ ఎప్పటిలాగే కాల్ అండ్ బీస్ట్ మోడ్ లో ఆకట్టుకున్నాడు. సినిమాని వన్ మ్యాన్ షోగా నడిపించాడు. అయితే.. ఒకే రోజులో జరిగే స్టోరీ కాబట్టి.. అజిత్ మూవీ మొత్తం ఒకే కాస్ట్యూమ్స్ లో ఉండటం జరిగింది. హీరో అనే కాదు.. దాదాపు అన్నీ క్యారెక్టర్స్ ఒకే కాస్ట్యూమ్ లో ఉండటం ప్రేక్షకులకు నచ్చవచ్చు.
చివరిమాట: తెగింపు.. యాక్షన్ విత్ నార్మల్ లైన్!
రేటింగ్: 2.5/5