కోట్లు సంపాదించడమే కాదు..నలుగురినీ ఆదుకునే మానవత్వం కూడా ఉండాలి. అలాంటి వ్యక్తే తమిళ అగ్ర నటుడు సూర్య. అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవంలో ఓ యువతి కధ విని భావోద్వేగానికి లోనయ్యాడు సూర్య. కంట తడి పెట్టాడు.
నిరుపేద విద్యార్ధులను ఆదుకునేందుకు, మంచి భవిష్యత్ అందించేందుకు సినీ హీరో సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ వేడుకల్లో జయప్రియ అనే ఓ యువతి చేసిన ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. సూర్య సహా అంతా కన్నీటి పర్యంతమయ్యారు. అగరం ఫౌండేషన్ సహాయంతో తన జీవితం ఏ దశ నుంచి ఎలా మారిందో వివరించింది.
వర్షం వస్తే ఇంట్లోకి నీళ్లు..పాములు..గతం కటిక దారిద్య్రం
నా పేరు జయప్రియ. ఇప్పుడైతే ఇన్ఫోసిస్ ఉద్యోగంతో హాయిగా ఉన్నాను. కానీ గతంలో నా జీవితంలోనే కాదు నా కుటుంబంలో కూడా సంతోషం పదమే లేదు. తండ్రి తాగుబోతు. మేమిద్దం అక్కాచెల్లెళ్లం. మట్టిగోడల ఇళ్లు. తాటాకుల పైకప్పు కావడంతో వర్షం వచ్చే ఇంట్లోకి నీళ్లతో పాటు పాములు కూడా వచ్చేసేవి. కరెంటు లేదు. చదువుకోవాలనే కోరిక ఉంది. ఏదో విధంగా 12 పూర్తి చేశాను. ఉన్న ఇళ్లు కాస్తా కూలిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అగరం ఫౌండేషన్ గురించి తెలిసింది. అంతే నా జీవితం మారిపోయింది.
మంచి కళాశాలలో చేర్పించి కెరీర్ గైడెన్స్‌తో పాటు చదివించారు. అన్నా యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నా. ముందు టీసీఎస్‌లో ఉద్యోగం, ఆ తరువాత ఇన్ఫోసిస్. నేను సంపాదించిన డబ్బులతో సొంత ఇళ్లు కట్టుకోవాలనే నా కల నెరవేర్చుకున్నాను. ఓపెద్ద ఇళ్లు కట్టుకున్నానంటూ గర్వంగా చెబుతున్న జయప్రియ మాటలు విని అంతా కదిలిపోయారు. హీరో సూర్య చలించిపోయాడు. అమ్మాయిలను చదవనివ్వండి..చదివితేనే కదా ఏదో ఒకటి సాధించగలరంటూ చెబుతుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఇది ఆమె విజయం ఒక్కటే కాదు..ఇలాంటి ఎందరో యువతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అగరం ఫౌండేషన్ సాధించిన గెలుపు కూడా.