ఒకప్పుడు ఏ సినిమా అయినా సరే థియేటర్లలో రిలీజయ్యేది. ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత.. డైరెక్టర్స్ ట్రెండ్ మార్చేశారు. కొత్త తరహా స్టోరీల్ని ఓటీటీల వేదికగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలా వచ్చిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి దర్శకురాలిగా చేసిన తొలి ప్రయత్నం ఇది. రిలీజ్ కి ముందే ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సిరీస్.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మీట్ క్యూట్’ ఎలా ఉంది ఏంటనేది.. కంప్లీట్ రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ
ఐదు కథల వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. స్వాతి(వర్ష బొల్లమ్మ).. తన అమ్మ చెప్పిందని పెళ్లిచూపుల్లో భాగంగా అభి(అశ్విన్ కుమార్)ని కలుస్తుంది. వారి పరిచయం ఎక్కడివరకు వెళ్లిందనేదే ‘మీట్ ద బాయ్’ ఎపిసోడ్. సరోజ(రుహానీ శర్మ), మోహన్ రావు(సత్యరాజ్) వీసా ఆఫీసులో కలుసుకుంటారు. తన కాపురంలో కలహాల గురించి సరోజ, మోహన్ రావుకి చెబుతుంది. చివరకు ఏం జరిగింది అనేది ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ ఎపిసోడ్. భర్తకు దూరమై, ఆర్కిటెక్ట్ గా పనిచేసే పూజ(ఆకాంక్ష సింగ్).. సిద్ధు(దీక్షిత్ శెట్టి)కు దగ్గరవుతుంది. దీని గురించి తెలుసుకున్న సిద్ధు తల్లి పద్మ(రోహిణి) ఏం చేసిందనేది ‘ఇన్ లవ్’ ఎపిసోడ్. అమన్(శివ కందుకూరి) డాక్టర్. ఓ రాత్రి, నటి షాలిని(అదాశర్మ)కి లిఫ్ట్ ఇచ్చి, తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆమె యాక్టర్ అని తెలియని అమన్.. తన ఇష్టాయిష్టాలు చెబుతాడు. ఇది ఎక్కడికి వరకు వెళ్లింది అనేదే ‘స్టార్ స్ట్రక్’ ఎపిసోడ్. అజయ్(గోవింగ్ పద్మసూర్య)తో బ్రేకప్ అయిన కిరణ్(సునైన).. అజయ్ తో రిలేషన్ షిప్ లో ఉన్న అంజన(సంచిత)ని కలుస్తుంది. చివరకు ఏమైంది అనేది ‘ఎక్స్ గాళ్ ఫ్రెండ్’ ఎపిసోడ్. అన్ని కథల వెనక మెయిన్ పాయింట్ ఏంటనేది తెలియాలంటే మాత్రం సిరీస్ పూర్తిగా చూడాల్సిందే.
‘అనుకోకుండా ఇద్దరు పరిచయమే లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య చోటు చేసుకునే పరిస్థితులు, మాటలు, ఆ జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి’ అని ప్రమోషన్స్ లో దర్శకనిర్మాతలు చెప్పారు. దానికి తగ్గట్లే అన్ని ఎపిసోడ్స్ సాగుతుంటాయి. చాలా వరకు సీన్స్ అన్నీ కూడా నేచురల్ గా ఉంటాయి. తొలి ఎపిసోడ్ లో భాగంగా అమ్మనాన్నల బలవంతంతో అమ్మాయి, పెళ్లి చూపులకు వెళ్లడం.. అక్కడ అబ్బాయి, సదరు అమ్మాయికి ఫ్లాట్ అయిపోవడం లాంటి సీన్స్ ఎక్కడో చూశాం కదా అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా చాలా నార్మల్ గా అనిపిస్తాయి. ఈ తరం వాళ్లు.. తమ అభిప్రాయాలకు మాత్రమే విలువ ఇస్తారు గానీ అవతలి వారు చెప్పింది అస్సలు వినిపించుకోరని, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని ప్రాబ్లమ్స్ పరిష్కారం అవుతాయని రెండో ఎపిసోడ్ లో చూపించారు. కానీ ఎమోషన్ సరిగా వర్కౌట్ కాలేదు.
భర్తని పోగుట్టుకున్న లేదా దూరమైన మహిళల మనోభావాలు ఎలా ఉంటాయి? మరో వ్యక్తిని తమ లైఫ్ లోకి అనుమతిస్తారా? అనే విషయాన్ని సీరియస్ గా చూపిస్తూనే.. కాస్త ఫన్ కూడా జోడించిన ఎపిసోడ్ ‘ఇన్ లవ్’. ఈ మొత్తం సిరీస్ కి ఈ ఎపిసోడ్ బ్యాక్ బోన్ గా నిలిచిందనే చెప్పాలి. డాక్టర్-యాక్టర్ కాంబోతో తీసిన ‘స్టార్ స్ట్రక్’ ఎపిసోడ్ లాజిక్స్ మిస్సయినట్లు కనిపిస్తుంది. డైలాగ్స్ కూడా చాలా రొటీన్ గా అనిపిస్తాయి. సీన్స్ మరింత బలంగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఓ ట్విస్ట్ తప్పించి.. చివరి ఎపిసోడ్ ‘ఎక్స్ గాళ్ ఫ్రెండ్’ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది.
డబుల్ మీనింగ్ అనేది చాలా నార్మల్ అయిపోయిన ఈరోజుల్లో.. క్లీన్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ చెప్పాలనుకోవడం నిజంగా గ్రేట్. ఆ విషయంలో డైరెక్టర్ దీప్తి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే డైరెక్టర్ గా తొలి అటెంప్ట్ అయినప్పటికీ.. ప్రతి స్టోరీలో ఎమోషన్స్, ఎండింగ్ ఇవ్వడంలో చాలా నేర్పు చూపించారు. డీటైలింగ్, కలరింగ్ విషయంలోనూ మార్కులు కొట్టేశారు. ఇక నటీనటుల విషయానికొస్తే.. తొలి ఎపిసోడ్ లో వర్ష, రెండో ఎపిసోడ్ లో సత్యరాజ్, మూడో ఎపిసోడ్ లో రోహిణి, నాలుగో ఎపిసోడ్ లో శివ కందుకూరి, ఐదో ఎపిసోడ్ లో సునైన.. తన అద్భుతమైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. స్టోరీ నార్మల్ గా ఉన్నప్పటికీ.. తన నటనతో సీన్స్ వర్కౌట్ కావడంలో కీ రోల్ ప్లే చేశారు. చాలా రోజులుగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చూసిచూసి బోర్ కొట్టినవాళ్లకు మాత్రం.. ‘మీట్ క్యూట్’ మంచి అనుభూతిని ఇస్తుంది. చాలా క్లీన్ నరేషన్ కనిపిస్తుంది.
ఇక టెక్నికల్ గా చూస్తే మాత్రం ‘మీట్ క్యూట్’ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్.. అన్ని ఎపిసోడ్స్ లోనూ ఇంప్రెస్ చేస్తాయి. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ దీప్తి గంటా.. చేస్తుంది ఫస్ట్ సిరీసే అయినప్పటికీ ప్రెజెంటేషన్ తో ఆకట్టుకున్నారు. ప్రతి పాత్రకు డీటైలింగ్ ఇచ్చిన విధానం చాలా బాగుంది. స్టోరీ పరంగా చాలా నార్మల్ గా అనిపించినప్పటికీ ఆమె వర్క్ మాత్రం ఆకట్టుకుంది. ముందు ముందు ఆమె నుంచి ఇలాంటి మరిన్ని మంచి సిరీస్ లేదా సినిమాలు రావొచ్చని అనిపిస్తోంది. ఇక థియేటర్లకు వెళ్లి సినిమాలు ఏం చూద్దాంలే ఇంట్లో కూర్చుని ఓటీటీలో ఓ మంచి సిరీస్ చూసేద్దాం అనుకుంటే మాత్రం ‘మీట్ క్యూట్’ ట్రై చేయొచ్చు.
చివరిమాట: మనసుకు హాయినిచ్చే ఓ సిరీస్ ‘మీట్ క్యూట్’.
రేటింగ్: 3/5
(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)