టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హిట్స్ చూసి.. కొన్నేళ్లుగా సరైన హిట్టు కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోలలో మంచు విష్ణు ఒకరు. ఢీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మంచు విష్ణు కెరీర్ లో అ స్థాయి హిట్ పడలేదనే చెప్పాలి. మధ్యలో చాలా జానర్స్ లో సినిమాలు ట్రై చేసినప్పటికి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో.. మళ్లీ తన ఫేవరేట్ జానర్ అయినటువంటి యాక్షన్ కామెడీతో ‘జిన్నా’ మూవీ చేశాడు. విష్ణునే స్వయంగా నిర్మించి నటించిన.. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ సూర్య తెరకెక్కించారు. ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ ద్వారా బజ్ క్రియేట్ చేసిన మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి జిన్నా మూవీతో విష్ణు హిట్టు కొట్టాడా లేదా? రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథ చిత్తూరులోని రంగంపేటలో జరుగుతుంది. గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నా(మంచు విష్ణు) టెంట్ హౌస్ నడుపుతుంటాడు. జిన్నాకు తోడుగా పచ్చళ్ళ స్వాతి(పాయల్ రాజపుత్), పండు(సద్దాం) ఉంటారు. జిన్నా ఏ పెళ్లికి టెంట్ వేసిన ఆ పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. అయితే.. చిన్నప్పటి నుండే కలిసి పెరిగిన జిన్నా, స్వాతి ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ.. పెళ్లి టైమ్ వచ్చేసరికి జిన్నాకు ఊరి నిండా అప్పులు ఉండటంతో అనుకోని సమస్యలో ఇరుక్కుంటాడు. మరోవైపు ఊరికి ప్రెసిడెంట్ అయ్యి అప్పులు తీర్చాలని అనుకుంటున్న టైంలో జిన్నాను ప్రేమిస్తున్నానంటూ అమెరికా నుండి రేణుక(సన్నీ లియోన్) ఊర్లో అడుగుపెడుతుంది. జిన్నాకు డబ్బు సాయం చేసి అప్పులు తీర్చేస్తుంది. కానీ.. అప్పుడే జిన్నాకు రేణుక గురించి భయంకరమైన వార్త తెలుస్తుంది. మరి రేణుక ఎంట్రీతో జిన్నా లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? చివరికి జిన్నాకు ఎవరితో పెళ్ళైంది? అనేది తెరపై చూడాల్సిందే.
టాలీవుడ్ లో హీరోగా నటిస్తూ తన సినిమాలు తానే ప్రొడ్యూస్ చేసుకుంటున్న హీరోలలో మంచు విష్ణు ముందుంటారు. కొన్నేళ్లుగా హిట్ కోసం ట్రై చేస్తున్న మంచు విష్ణు.. సినిమాల పరంగా కాకుండా, మా ప్రెసిడెంట్ గా ట్రోల్స్ కి గురవుతుంటారు. అయితే.. గతంలో ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి యాక్షన్ కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న విష్ణు.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అదే జానర్ లో ఈ ‘జిన్నా’ మూవీ చేశాడు. అందులోనూ విష్ణు పక్కన హాట్ బ్యూటీ సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ అనేసరికి సినిమాపై కాస్తోకూస్తో ఆడియన్స్ లో అటెన్షన్ ఏర్పడింది. అదిగాక జిన్నా మూవీని తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు.
ఇక జిన్నా విషయానికి వచ్చేసరికి.. ఇది పక్కా గ్రామీణ నేపథ్యంలో పాత కథకు కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి తెరకెక్కించారు. ఒకే ఊరిలో చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన హీరోహీరోయిన్స్ ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్ ఎన్నో సినిమాలలో చూశాం. ఈ జిన్నా మూవీ కూడా అలాంటి రొటీన్ లైన్ తో వచ్చింది. కథలో ఎన్ని మలుపులు, ట్విస్టులు జోడించినా.. కథ నడిచేది కేవలం ఒకే గ్రామంలో కాబట్టి.. పెద్దగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏవి కనిపించవు. జిన్నా మూవీలో యాక్షన్ తో పాటు హారర్ కామెడీని కూడా మిక్స్ చేశారు. సినిమా ఓపెనింగ్ బాగుంది. చిన్నతనంలో జిన్నా, స్వాతి, రేణుకల ఫ్రెండ్ షిప్ ని సాంగ్ తో చూపించారు.
కట్ చేస్తే.. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ సినిమాలలో మాదిరిగా స్కూల్ టైంలో హీరోయిన్ అమెరికాకు వెళ్లిపోవడం.. తిరిగి వచ్చేసరికి హీరో బేవర్స్ గా ఉండటం మామూలే అనిపిస్తుంది. అయితే.. విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి.. ఇందులో హీరో టెంట్ హౌస్ నడుపుతూ అప్పుల పాలవ్వడం, ప్రెసిడెంట్ గా పోటీ చేయడం, తనతో పాటు పెరిగిన పచ్చళ్ళ స్వాతి(పాయల్)ని లవ్ చేయడం.. మధ్యమధ్యలో కామెడీని అల్లుకొని ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టైమ్ కి రేణుక(సన్నీ లియోన్) క్యారెక్టర్ తో బిగ్ ట్విస్టు ప్లాన్ చేశారు.. కానీ, అది పెద్దగా థ్రిల్లింగ్ అనిపించదు. ఎందుకంటే.. హీరోని దక్కించుకోవడానికి హీరోయిన్ వేరే అమ్మాయిలను చంపడం అనేది ఇదివరకు చూసేశాం.
ఇందులో కూడా రొటీన్ స్టోరీతో పాటు ట్విస్టులు కూడా ఇంటరెస్టింగ్ గా లేవు. కాకపోతే జిన్నా మూవీని దాదాపు కామెడీపై ఆధారపడి సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే.. సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ తప్ప స్క్రీన్ ప్లే, లవ్ స్టోరీ అన్ని రొటీన్ గా రాసుకున్నారు. సెకండాఫ్ మొదలైనప్పటి నుండి కథలో ఏమైనా ఊపు కనిపిస్తుందేమో అనుకుంటే.. హీరో క్యారెక్టర్ పడిపోయి.. రేణుక క్యారెక్టర్ లో సన్నీ లియోన్ హైలైట్ అవుతుంది. హారర్ కామెడీ కాబట్టి.. మధ్యలో సొంత ఫ్యామిలీని చంపే సీన్స్ భయంకరంగా లేవు.. కానీ, సినిమా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
క్లైమాక్స్ కి వచ్చేసరికి పాత సినిమాల్లో లాగే ఇద్దరు హీరోయిన్స్ లో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అనే పాయింట్ రైస్ చేస్తారు. కానీ.. అప్పటికే కథాకథనాలలో బలం, పట్టు లేకపోవడంతో.. ప్రేక్షకులకు సీన్ అర్థమైపోతుంది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ వేలు కాదు కదా.. అసలు గుడ్డిగా ఫాలో అయ్యాడేమో అనిపిస్తుంది. కోన వెంకట్ కథకు.. మోహన్ బాబు స్క్రీన్ ప్లే అని టైటిల్ కార్డు పడినప్పుడే జనాలు షాక్ అవుతారు. సినిమాలో జిన్నాగా మంచు విష్ణు క్యారెక్టర్, చిత్తూరు యాసలో కామెడీ బాగుంది. ముఖ్యంగా విష్ణు ఫైట్స్, డాన్స్ కోసం బాగా కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. కానీ.. ఏదైనా కొత్త కథ కోసం కష్టపడి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
ఈ సినిమాలో రేణుకగా సన్నీ లియోన్, పచ్చళ్ళ స్వాతిగా పాయల్ రాజపుత్, జిన్నా ఫ్రెండ్ పండు క్యారెక్టర్ లో సద్దాం, మైసూర్ బుజ్జిగా వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్ గా చమ్మక్ చంద్ర, నరేష్ నటన ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ సాంగ్స్, బీజీఎం పరవాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. కానీ.. కథలో మేటర్ లేక అంత గొప్పగా అనిపించలేదు. రచయితలు రొటీన్ కథలో కొత్త కామెడీ జోడించినా ఫలితం మారదు అనే చెప్పాలి. డెబ్యూ డైరెక్టర్ సూర్య.. తనవరకు న్యాయం చేశాడు. హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు.. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు అనిపిస్తాయి. మరి చూడాలి.. జిన్నా భాయ్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో!