Adipurush Review & Rating In Telugu: ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఆధ్యాత్మిక చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సాహో, రాధే శ్యామ్ సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాతో హిట్ కొట్టారా? లేదా? రివ్యూలో చూద్దాం.
రామాయణం కథ అందరికీ తెలిసిందే. అయినా కానీ ఎంతమంది ఎన్ని సార్లు తీసినా గానీ చూడాలనిపిస్తుంది. ఒక మాస్ హీరో భక్తి ప్రధాన చిత్రాన్ని ఎంచుకోవడమే గొప్ప విషయం. అందుకు ప్రభాస్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ పడలేదు. దీంతో ప్రభాస్ తో సహా అందరూ ఆదిపురుష్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చూసి బాలేదన్న విమర్శలు మూటగట్టుకున్నా గానీ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎట్టకేలకు విమర్శల సముద్రాన్ని దాటుకుంటూ ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ లంకకు బయలుదేరింది. మరి లంకలో ఆదిపురుష్ ప్రభాస్ విజయం సాధించారా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
వనవాస సమయంలో సీతారాములు (ప్రభాస్, కృతిసనన్), లక్ష్మణుడు (సన్నీ సింగ్) ఒక చోట ఉంటారు. ఆ సమయంలో శ్రీరాముడిని చూసి శూర్పణఖ మనసు పడుతుంది. తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. దానికి శ్రీరాముడు.. తనకు సీతతో వివాహం జరిగిందని చెప్పి శూర్పణఖ కోరికను తిరస్కరిస్తాడు. దీంతో శూర్పణఖ సీత మీద హత్యా ప్రయత్నం చేస్తుంది. వెంటనే రాముడు శూర్పణఖ ముక్కు కోసేస్తాడు. శూర్పణఖ అన్న రావణుడి దగ్గరకు వెళ్లి తన బాధ చెప్పుకుంటుంది. తన చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా రావణుడు సీతను అపహరిస్తాడు. లంకలో బంధించి తనను వివాహం చేసుకోమని వేధిస్తుంటాడు.
సీతాపహరణ తర్వాత రాముడు ఎలాంటి వేదనకు గురయ్యాడు? సీత ఆచూకీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? లంక ప్రయాణం ఎలా కొనసాగింది? రామసేతు నిర్మాణం ఎలా జరిగింది? లంకకు చేరుకున్నాక రావణుడితో రాముడి యుద్ధం ఎలా జరిగింది? రావణ సంహారం ఎలా జరిగింది? ఈ క్రమంలో రాముడికి హనుమంతుడు, లక్ష్మణుడు, వానరులు ఎలాంటి సహకారం అందించారు? అనేది మిగిలిన కథ. ఈ విజువల్ ట్రీట్ ని చూడాలంటే సినిమా చూడాల్సిందే.
రావణాసురుడు అమరత్వం కోసం ఘోర తపస్సు చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. రావణాసురుడి పాత్రను పవర్ ఫుల్ గా చూపించారు దర్శకుడు ఓం రౌత్. 15 నిమిషాల తర్వాత యాక్షన్ ఎపిసోడ్ తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత సీతారామ, లక్ష్మణుల వనవాసం, సీతను రావణుడు అపహరించడంతో అసలు కథ మొదలువుతుంది. మొదటి భాగంలో సీతాపహరణ సమయంలో జటాయువు రావణాసురుడితో పోరాడే సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీఎఫ్ఎక్స్ పని తీరు చాలా బాగుంది. ఇక వాలి, సుగ్రీవుల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తొలి భాగం అంతా భావోద్వేగాలు, పోరాట సన్నివేశాల మధ్య నడుస్తుంది.
రెండవ భాగంలో వచ్చే రామసేతు నిర్మాణ సమయంలో సముద్రుడు, రాముడి మధ్య వచ్చే సన్నివేశం బాగుంది. రామసేతుని చూపించిన విధానం బాగుంది. వీఎఫ్ఎక్స్ కొత్త అనుభూతిని కలిగిస్తాయి. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే సన్నివేశం, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడితో పోరాట సన్నివేశాలను చాలా బాగా చూపించారు దర్శకుడు. రాముడు, రావణుడు తొలిసారి ఎదురుపడిన సన్నివేశాన్ని చాలా కొత్తగా, ఆసక్తికరంగా తెరకెక్కించారు.
శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నూటికి నూరు శాతం న్యాయం చేశారు. శ్రీరాముడి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. సినిమాకి ప్రభాస్ నటనే హైలైట్ గా నిలుస్తుంది. సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, ఆంజనేయుడిగా దేవదత్త నాగే, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా నటించారు. శూర్పణఖగా తేజస్విని పండిట్, మండోదరిగా సోనాల్ చౌహన్ ల నటన బాగుంది.
ఆదిపురుష్ సినిమాకి సంగీతమే ప్రాణం. నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన అలంకారంగా నిలిచింది. సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. అజయ్, అతుల్ లు అందించిన జై శ్రీరామ్ పాటకి థియేటర్ లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కార్తీక్ పలాని ఛాయాగ్రహణం అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. తన కెమెరా పనితనంతో సన్నివేశాలని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 3డీ ఫార్మాట్ లో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఆదిపురుష్ సినిమాకి బెస్ట్ గ్రాఫిక్ వర్క్ జరిగిందని చెప్పవచ్చు. చాలా సన్నివేశాల్లో 3డీ ఎఫెక్ట్స్ థ్రిల్ కి గురి చేస్తాయి. అయితే ద్వితీయార్థంలో వచ్చే గ్రాఫిక్ వర్క్ అంతగా ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్ట్ విభాగం సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.
చివరి మాట: ప్రేక్షకాభిమాన వానరులు నిర్మించిన రామసేతు మీద బాక్సాఫీస్ లంకకు చేరుకొని ఆదిపురుష్ విజయ యాత్రను కొనసాగిస్తోంది. జై శ్రీరామ్!
రేటింగ్: 3/5