Titanic: ‘టైటానిక్’ ఓడ విషాదం గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి. 1912 ఏప్రిల్ 15న 2 వేలకు పైగా ప్రయాణికులతో వెళుతున్న టైటానిక్ ప్రమాదానికి గురైంది. నార్త్ అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ ప్రమాదంలో 1500 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు వంద ఏళ్ల తర్వాత 1997లో జేమ్స్ క్యామెరూన్ తీసిన ‘టైటానిక్’ సినిమాతో ఈ విషాదం గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే, ఈ సినిమా రాకముందు నుంచి కొంతమందికి ‘టైటానిక్’ అంటే ఓ పిచ్చి. దాన్ని నేరుగా చూడాలన్నదే వారి చిరకాల కోరిక. అలాంటి వారిలో రెనాడా అనే మహిళ కూడా ఒకరు. టైటానిక్‌ను నేరుగా చూడాలన్న బలమైన కాంక్షతో తన జీవితాన్నే ఆమె పక్కన పెట్టింది.
ఏకంగా 30 ఏళ్ల పాటు కష్టపడి తన కలను నెరవేర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రెనాటా అనే మహిళకు చిన్నప్పటినుంచి టైటానిక్ అంటే ప్రాణం. టైటానిక్‌ను ఒక్కసారైనా నీళ్లలోకి వెళ్లి చూడాలన్నది ఆమె కోరిక. అయితే, 30 ఏళ్ల క్రితం టైటానిక్ జాడ ఇంకా కనుక్కోలేదు. అందుకే కాలేజ్‌లో కూడా సముద్రంలోకి వెళ్లటానికి పనికి వచ్చే చదువులు చదివింది. ఎందుకంటే.. టైటానిక్ షిప్‌ను కనుక్కున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలవాలని ఆమె అనుకుంది. అయితే, ఆ కొద్దిరోజులకే దాని జాడ తెలిసింది. దీంతో ఆమె తన ప్లాన్‌ను మార్చుకుంది. అట్లాంటిక్ మహా సముద్రంలోకి వెళ్లి నేరుగా టైటానిక్‌ను చూడటానికి డబ్బులు దాచిపెడుతూ వచ్చింది.
దాదాపు 30 ఏళ్లు అలా డబ్బులు దాచుకుంటూ వచ్చింది. పెళ్లి, పిల్లలు ఇలా దేన్నీ పట్టించుకోలేదు. ఆఖరికి కారు కూడా కొనుక్కోలేదు. తాజాగా, ఆమె తన కలను నెరవేర్చుకుంది. దాదాపు రెండు కోట్లు ఖర్చుపెట్టి సబ్‌మెరైన్‌లో టైటానిక్ షిప్ దగ్గరకు వెళ్లింది. మొదటి సారి, అతి దగ్గరగా టైటానిక్‌ను చూసి భావోద్వేగానికి గురైంది. కంట తడి పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మనం ఏదైనా కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది’’..‘‘ డ్రీమ్స్ కమ్ ట్రూ.. అంటే ఇదేనేమో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెనాటాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.