ఒకప్పుడు పెళ్లంటే.. ఆత్మీయతలు, అనుబంధాలు, విలువలు. కానీ, ఇప్పుడు పెళ్లంటే.. ఆస్తి, కట్నం, అధికారం, అవసరం, మోహం వ్యామోహం. బంధాలకు, అనుభందాలకు విలువ ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. సంతలో పశువులు కొన్నట్లుగా.. ఎంతిస్తావ్ అంటూ మొహమాటం లేకుండా అడుగుతుంటారు. ఇక్కడ కట్నం ముట్టేది వరుడికే.. పెద్దరికం వరుడికే. వాస్తవంగా చెప్పాలంటే.. కట్నం ఇచ్చి కొంటుంది వధువు కనుక.. ఆమెకు అందాలి పెద్దరికం. సమాజంలో అలా ఉండట్లేదు. అందింది చాలదన్నట్లు.. అదనపు కట్నం కోసం వేధించే వారు.. బోలెడు. ఇలాంటి రోజుల్లో ఓ వరుడు తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కట్నం తీసుకోలేదా! అంటే.. తీసుకున్నాడు. కానీ, ఒక్క రూపాయి మాత్రమే.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్‌కు శుక్రవారం.. ఓ ఆర్మీ జవాన్ కూతురుతో పెళ్లి జరిగింది. ఈ సమయంలో ఆచార, సంప్రదాయాల్లో భాగంగా వధువు తల్లిదండ్రులు, అతడికి రూ.11 లక్షల రూపాయల నగదు, కొన్ని ఆభరణాలను అందజేశారు. అయితే అతడు మాత్రం ఆ డబ్బనంతా వధువు తల్లిదండ్రులకే ఇచ్చేసి.. ‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా..’ అని ఒక రూపాయి మాత్రం తీసుకున్నాడు. దీంతో అత్తమామలు, పెళ్లికొచ్చిన బంధువులు, గ్రామస్తులు.. అతడిని నిండు నూరేళ్లు ఆయుష్షుతో వర్ధిల్లాలంటూ దీవించారు.
అయితే.. సౌరభ్ చౌహాన్ ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. మన దేశంలో వరకట్నం కోసం కోడళ్లను తగలబెట్టిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఎక్కడో చోట వరకట్నం చావులు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన చట్టం ఉన్నా.. ప్రయోజనం శూన్యం. ఆచారాలు, సంప్రదాయాల పేరుతో కట్నం ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. కట్నం ఇవ్వలేక ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు.. ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీని మార్పు కోసమే ఓ ముందడుగు వేశాడు.