Silver Coins: కొంతమంది వ్యక్తులు నిధుల కోసం ఎంతో కష్టపడుతుంటారు. అలాంటి వారికి నిధులు చిక్కే అవకాశం చాలా తక్కువ. కానీ, కొంతమందికి కష్టపడకుండానే నిధులు దొరుకుతుంటాయి. పొలం దున్నినప్పుడో.. ఇంటి కోసం పునాదులు తీస్తున్నప్పుడో ఇలా ఎలాంటి కష్టం లేకుండానే దొరికేస్తుంటాయి. తాజాగా, ఓ వ్యక్తికి చెందిన పాత ఇంటిని కూల్చగా.. కుప్పలుగా వెండి నాణేలు బయటపడ్డాయి. దీంతో జనం వెండి నాణేల్ని సొంతం చేసుకోవటానికి ఎగబడ్డారు. ఇంతకీ సంగతేంటంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఓ పాత ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆ ఇంటికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.
ఆ ఇళ్లు కూడా పడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు పగుళ్లు వచ్చాయి. ఆ ఇంటిని చూసిన ప్రతీసారి పొరిగిళ్ల వారికి భయం వేసేది. ఎప్పుడు కూలి మీద పడుతుందోనని అల్లాడిపోయేవారు. ఈ నేపథ్యంలోనే వారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా ఇంటి యజమానికి నోటీస్ ఇచ్చారు. అయితే, ఇంటి యజమాని ఆ నోటీస్‌ను పట్టించుకోలేదు. నోటీసులు పంపినా పట్టించుకోకపోటంతో అధికారులే రంగంలోకి దిగారు. ప్రొక్లైన్‌తో ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఇంట్లో వారిని ఖాళీ చేయించి, ఇంటిని కూల్చటం మొదలుపెట్టారు.
కొద్ది సేపటి తర్వాత కూలిన గోడలోంచి వెండి నాణేలు వర్షంలా కిందపడటం మొదలైంది. అక్కడున్న వారంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే వెండి నాణేలను సొంతం చేసుకోవటానికి ఎగబడ్డారు. జనం ఇంట్లోకి ఎగబడ్డంతో కూల్చివేత ఆగిపోయింది. అదికారులు జనాల్ని హెచ్చరించి బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 160 నాణేలు గోడలోంచి బయటపడ్డట్టు తెలిపారు. అవి ఒక్కోటి 10 గ్రాముల బరువు ఉన్నాయని వెల్లడించారు. ఆ నాణేలు 1890 నాటివని పేర్కొన్నారు. వాటి ధర మార్కెట్‌లో వెయ్యి రూపాయలకు పైనే ఉంటుందని అన్నారు.