కరోనా.. ఈ మూడు అక్షరాలు సృష్టిస్తున్న మారణహోమం అంతా ఇంతా కాదు. మానవాళి ఉనికిని సైతం ప్రశ్నార్ధకం చేసేలా ఈ మహమ్మారి ప్రయాణం కొనసాగుతోంది. అయితే.., ఈ కష్ట సమయంలో కరోనాకి సంబంధించిన వార్తలు చాలానే పుట్టుకొస్తున్నాయి. వీటిలో నిజం ఏదో, అబద్దం ఏదో తెలియక ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి చర్చకి కారణం అయ్యింది. స్త్రీలు పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా? లేదా? ఇప్పుడు ఇదే అతి పెద్ద టాపిక్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కొనసాగుతోన్నాయి. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కానీ.., ఇలాంటి సమయంలో ఓ వార్త మహిళలను కలవర పరుస్తోంది.
నెలసరికి అయిదు రోజుల ముందు, అయిదు రోజుల తర్వాత వ్యాక్సీన్ తీసుకోవద్దు. నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత.. రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.. నెమ్మదిగా పెరుగుతుంది. నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకోవద్దు అంటూ ఓ సందేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంతో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆడవారిలో నెలసరి అనేది ఒక సహజ ప్రక్రియ. దానికి వ్యాక్సీన్ కి అస్సలు సంబంధం లేదు. ఇది డాక్టర్స్ చెప్తున్న మాట. ఇక వ్యాక్సిన్ వల్ల పీరియడ్స్ ప్రభావితమవుతుందనే వాదనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఖండించింది. నీతిఅయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా పీరియడ్స్‌లో ఉన్న మహిళలు నిరభ్యంతరంగా టీకా వేసుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో.., సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ సందేశం తప్పుడు వార్త అని అర్ధం అయిపోయింది. కాకపోతే కరోనా సోకాక మాత్రం.. మహిళల నెలసరిలో కొన్ని మార్పులు సంభవిస్తున్నాయి. అంతకు మించి వ్యాక్సిన్ కి నెలసరికి ఎలాంటి సంబంధం లేదు. మహారాష్ట్రలో కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. దీంతో.., ఈ ఫేక్ న్యూస్ త్వరగా స్ప్రెడ్ అయ్యింది. అంతకు మించి భయపడాల్సిన పని లేదు. అందరూ దైర్యంగా వ్యాక్సిన్ వేపించుకోవచ్చు.