సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఐదు రోజుల పాటు ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రీతి మృతి చెందింది.
బాగా చదువుకుని డాక్టర్ కావాలని కలలు కన్నది ప్రీతి. ఆ కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. మరోవైపు ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. చదువుల్లో మేటి.. ఎంతో చలాకీగా ఉండే అమ్మాయి. తన ముందు అన్యాయం జరిగితే సహించేది కాదు అంటారు ప్రీతి తల్లిదండ్రులు, స్నేహితులు. అలాంటి విద్యార్థిని.. ఓ సైకో వేధింపులు తాళలేక తనువు చాలించేందకు ప్రయత్నం చేసింది. అత్యంత ప్రమాదకరమైన ఇంజెక్షన్‌ని తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రీతిని బతికించడానికి వైద్యులు ఐదు రోజుల పాటు శ్రమించారు. కానీ ఆ ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఐదు రోజుల నుంచి మృత్యువతో పోరాడుతూ.. అలసిపోయిన ప్రీతి కన్ను మూసింది. తల్లిదండ్రులకు తీరని గుండె కోతను మిగిల్చింది.
ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన నాటి నుంచే ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమెను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే గుండె ఆగిపోతే సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఇక హైదరాబాద్ నిమ్స్‌లో ఆమెకు వైద్యం అందించారు. ఆమెకు ఎక్మో సపోర్ట్ తో చికిత్స అందించారు. ఇక ప్రీతి బ్రెయిన్‌డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. ఇక ఆదివారం ప్రీతి కన్నుమూసింది. ఆదివారం నాటికే ఆమె బతికే అవకాశాలు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇక ఆదివారం సాయంత్రం ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిమ్స్ ఆస్పత్రి వద్దకు వచ్చారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇక సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడిన రికార్డింగ్ వైరలయ్యింది. ప్రీతి తల్లితో మాట్లాడుతూ.. సైఫ్ తనను ఎలా ఇబ్బంది పెడుతున్నాడో వివరించింది. సీనియర్లంతా ఒకటై తమను వేధిస్తున్నారని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కాలేజీ యజమాన్యానికి తెలిపింది.
కానీ ఎవరు తన గోడు పట్టించుకోలేదు. అన్ని దారులు మూసుకుపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది. ఇక సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి చనిపోయిందని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.