మనిషి చనిపోయిన తర్వాత అవయవదానం చేయడం వల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినవారు అవుతారు. తాను చనిపోయి తన అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపింది ఓ టీచరమ్మ. పుట్టెడు దుఖఃంలో ఉండి కూడా కుటుంబ సభ్యులు ఇతరులకు ప్రాణదానం చేయాలనే సదుద్దేశంతో జీవన్‌దాన్ సంస్థకు కు అవయవాలను అప్పగించి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
సంస్థాన్ నారయణపురానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో నివసిస్తుంది. నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్ లో విజయలక్ష్మి అధ్యాపకురాలిగా విధులు నిర్వహించేది. ఈ క్రమంలో ఆమెకు విపరీతమైన తల నొమ్మి రావడంతో ఉన్నట్టుండి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించి వెంటనే కుటుంబ సభ్యులు మలక్‌పేట యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రెండు రోజుల చికిత్స పొందుతూ విజయలక్ష్మి కోమాలోకి వెళ్లింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు.
విజయలక్ష్మి మరణించిన విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ వైద్య బృందం ఆమె కుటుంబ సభ్యులను కలిసి అవయవ దానం గురించి దాని గొప్పతనం గురించి అవగాహన కల్పించారు. జీవన్‌దాన్ వైద్య బృందం చెప్పిన మాట ప్రకారం వారు అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇలా విజయలక్ష్మి చనిపోయి కూడా ఐదుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. విజయలక్ష్మి మేడం ఇక లేరని తెలియడంతో ఆ పాఠశాలలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.