రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సమాతామూర్తి సన్నిదిలో 11వ రోజు రామానుజచార్యల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో.. శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమతా మూర్తిని దర్శించుకున్నారు. సమతా మూర్తి ప్రాంగణంలో 108 దివ్య దేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్తులను పెంచుకోవడమే కాదు.. పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉందన్నారు. సాటి మనిషికి సేవ చేయడమే నిజమైన ఆద్యాత్మికత అన్నారు.
మఠాధిపతులు ప్రజలల్లోకి వెళ్లి తమ సందేశాలతో ప్రజల్లో స్ఫూర్తి నింపాలన్నారు. ఆధ్యాత్మిక భావానికి సేవా భావాన్ని జోడించాలన్నారు. సమతామూర్తితో జీయర్ స్వామి సమానత్వం చాటి చెప్పారన్నారు. సమతామూర్తి కేంద్రం ప్రపంచంలో 8వ వింత అని అభివర్ణించారు. ధర్మ పరిరక్షణకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. కులం కంటే గుణం గొప్పదని ఎలుగెత్తారని వివరించారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎన్నో దేశాల నుంచి ఎందరో వచ్చి సందర్శిస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు.
సమతామూర్తి స్ఫూర్తిని పెంచడమే కాదు, అందరికీ పంచాలని పిలుపునిచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు సహస్రాబ్ది ఉత్సవాల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి మహమూద్ ఆలీ, మెగా స్టార్ చిరంజీవి దంపతులు, సినీ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తానియా పాల్గొన్నారు.