ప్రభుత్వ ఆస్పత్రులను అద్బుతంగా తీర్చి దిద్దామని.. మెరుగైన వసతులను ఏర్పాటు చేశామని.. ఎప్పటికప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వాలు చెబుతుంటాయి.. కానీ రోగులు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిత్యం ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు.
తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది..కానీ కొన్నిచోట్ల ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై బాధితులు తీవ్ర అసంతృప్తి తెలియజేస్తున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొన్నిసమయాలో పెషెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూర్యపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. డాక్టర్లు అందుబాటు లో లేకపోవడంతో ఓ గర్భిణికి నర్సులు డెలివరీ చేశారు. అది కాస్త వికటించడంతో పుట్టిన శిశువు పురిటిలోనే కన్నుమూసింది. నడిగూడెం మండలం వెంకట రామాపురం గ్రామానికి చెందిన మానస డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికే ఆమెకు తీవ్రంగా నొప్పులు రావడంతో సిబ్బంది డాక్టర్ కు సమాచారం ఇచ్చారు. కానీ ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేడు.. దీంతో నర్సులు మానసకు డెలివరీ చేశారు. పసికందుకి సీరియస్ గా ఉందని కొద్దిసేపు హడావుడి చేశారు. ఆ సమయంలో పిల్లల డాక్టర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో శిశువు మృతి చెందింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం.. వచ్చిరాని వైద్యంతో నర్సులు డెలివరీ చేయడం వెరసి ఓ చిన్నారి మృతికి కారణం అయ్యిందని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. నర్సుల నిర్లక్ష్యం వల్లనే శిశువు మృతి చెందిందని.. పుట్టిన వెంటనే తన బిడ్డ కన్నుమూసిందన్న వార్త తెలిసి తల్లితో సహ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, నర్సుల నిర్వాకం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.