వ్యవసాయ పొలాల వద్ద మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంటు షాకుకు గురై ఎంతో మంది రైతులు ప్రాణాలు వదులుతుంటారు. అందుకు రక రకాల కారణాలలు ఉంటాయి. అందులో తడి చేతులతో మోటార్ ఆన్ చేయడం కూడా ఒక కారణం. రెండేళ్ల క్రితం ఈ కారణంతోనే ఓ యువకుడి తండ్రికి ప్రమాదం జరిగింది. ఇలా విద్యుత్ మోటార్లు ఆన్ చేసే క్రమంలో ఎంతో మంది రైతులు మరణించడం కూడా ఆ యువకుడు చూశాడు. బోరు మోటార్ ఆన్ చేసే సమయంలో రైతులు ప్రమాదాలకు గురికాకుండ చేయాలనే ఆలోచన ఆ యువకుడిలో కలిగింది. అదే ఉద్దేశాన్ని అమలు పరిచాడు. అనేక ప్రయోగాలు చేసి చివరికి ఓ సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించాడు. ఆ యువకుడు నాగర్ కర్నూలు వాసి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కళ్యాణ్ ప్రభుత్వ పాల్ టెక్నీక్ కళాశాలలో ఎలక్ర్టిక్ విభాగంలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం వ్యవసాయ పొలం వద్ద బోర్ మోటార్ ఆన్ చేసే సమయంలో తండ్రి లక్ష్మయ్య విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అదృష్టవశాత్తూ ఏమి జరగలేదు. ఈ ప్రమాదం విద్యార్ధి కళ్యాణ్ ను కదిలించింది. తన తండ్రి మాదిరిగా మరే రైతు బోరు మోటార్ వద్ద ప్రమాదానికి గురి కాకూదని భావించాడు. తనకు ఎలక్ట్రిక్ పై ఉన్న పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి విద్యుత్ మోటార్ ముట్టుకోకుండానే ఆన్.. ఆఫ్ అయ్యేలా ఓ పరికరాన్ని రూపొందించాలనుకున్నాడు.
అనేక ప్రయోగాలు చేసి చివరికి తనకు అనుకున్న పరికరాన్ని తయారు చేశాడు. చప్పట్లు కొడితే చాలు మోటార ఆన్ లేదా ఆఫ్ అయ్యేలా ఆ పరికరాన్ని రూపొందించాడు కళ్యాణ్. దీని తయారికి కేవలం 1500 రూపాయల మాత్రమే ఖర్చు చేశాడు. ఈ పరికరం తయారిలో సోలార్ ప్యానల్, సర్వో మోటార్, సౌండ్ సెన్సార్, ఓ స్మార్ట్ ఫోను ను ఉపయోగించాడు. కళ్యాణ్ తయారు చేసిన పరికరాన్ని చూసిన చుట్టుపక్కల రైతులు అభినందిస్తోన్నారు. చిన్న వయస్సులోనే మంచి ప్రయత్నం చేశాడంటూ కొనియాడుతున్నారు.
కళ్యాణ్ మాట్లాడుతూ.. అవసరమైతే చప్పట్ల ఆప్షన్ ను లాక్ చేసి కూడా ఉంచుకోవచ్చని చెబుతున్నాడు. ఇక రైతులు తడి చేతులతో బోరు మోటార్ ఆన్ చేయాల్సిన అవసరం లేదని, ప్రోత్సహిస్తే మరిన్ని కొత్త ప్రయోగాలు చేస్తానన్నాడు. సమస్యకు కొత్తగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణ చేసిన కళ్యాణ్ నేటి తరం యువకులకు ఆదర్శం. రైతు కుటుంబలో పుట్టి తండ్రి కష్టాన్ని చూసి ఇలాంటి కొత్త పరికరాన్ని తయారు చేసిన ఈ యువకుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.