సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి మనిషి జీవిత కాలపు కల! ఆ కల కోసం రేయింబవళ్లు కష్టపడి కూడబెట్టిన సంపాదనంతా ఒక్క క్షణంలో మోసగాళ్ల పాలైతే ఆవేదన ఎలా ఉంటుంది? ‘ప్రీలాంచ్ ఆఫర్’ పేరుతో తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ ఏకంగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశారు! కేంద్ర ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను సైతం నమ్మించి మోసం చేసిన ఈ భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం సంచలనంగా మారింది…
ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో తక్కువ ధరకే ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పి తమ నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ పలువురు కేంద్ర ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. త్రిపురా కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ పసుపులేటి సుధాకర్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. 2021లో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ త్రిపురా కన్స్ట్రక్షన్ సంస్థ భారీ ఎత్తున ప్రీలాంచ్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్ ధర కంటే తక్కువకు ఇల్లు వస్తుందనే ఆశతో ఎంతోమంది ఉద్యోగులు ఆ వలలో చిక్కుకున్నారు. దీంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉద్యోగులు, పలు సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగులు సొంతింటి ఆశతో ఒక్కొక్కరు లక్షల రూపాయలు, కొందరైతే తమ జీవిత దాచుకున్న మొత్తాన్ని ఆ సంస్థకు చెల్లించారు. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత అసలు మోసం బయటపడింది. ఫ్లాట్ల నిర్మాణం ఎక్కడా ప్రారంభించకుండా సంస్థ ప్రతినిధులు కాలయాపన చేస్తూ వచ్చారు. అంతేకాకుండా, తమకు ఫ్లాట్లు నిర్మిస్తామని చెప్పి కొనుగోలు చేసిన ఆ భూమిని.. ఇప్పుడు ఏకంగా మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించేందుకు ఆ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. సుమారు 350 మంది నుండి దాదాపు 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి చేతులు దులుపుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.
సొంతింటి కోసం ఎంతో కష్టపడి, ఓర్పుతో కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని నమ్మి మోసపోయామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫ్లాట్ ఇవ్వకపోగా, కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మోసపూరిత వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, పసుపులేటి సుధాకర్‌పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని వారు సీసీఎస్ పోలీసులను వేడుకుంటున్నారు. జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలనే సామాన్యుడి ఆశను అడ్డం పెట్టుకుని కొందరు చేసే ఈ వ్యాపారం ఎంతటి దారుణమైనదో ఈ ఘటనే నిదర్శనం.
