తెలుగు రాష్ట్రాల్లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణను వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు పంటలు దెబ్బతిని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు మరోసారి హెచ్చరికలు వచ్చాయి.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎండాకాలమా, లేదా వర్షకాలమా అన్న మీమాంసలో ప్రజలు బతుకుతున్నారు. ఎండ వస్తుంది కదా అని బయటకు వెళుతుంటే.. వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణను వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు పంటలు దెబ్బతిని రైతులు కన్నీరు పెడుతున్నారు. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో చినుకు పడుతుందంటే భయమోస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు చేరుతుంది. నాలాలు, మ్యాన్ హోల్స్, గుంతలు ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ వర్షాలకు పలువురు మృత్యువాత పడ్డారు. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే మరో పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది.
రానున్న కొన్ని గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వానలు కురవనున్నాయని, మరో 5 రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌ను కూడా మరోమారు వర్షాలు ముంచెత్తనున్నట్లు తెలిపింది. మరో 3 గంటల్లో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ- హైదరాబాద్ వాతావరణ సూచన శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘామృతమై రోజులో ఒకటి లేదా రెండు సార్లు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మే 4,5,6 తేదీల్లో చిరు జల్లులు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదే విధంగా మే 7,8 వ తేదీలలోనూ కూడా ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్ లో వచ్చే రెండు రోజులు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఐదు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కన్నా తక్కువ డీగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 23, 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రోడ్డు మీద నుంచి వెళ్లే ప్రజలకు మ్యాన్ హెల్స్‌తో, గుంతలు పడి ఉన్న ప్రదేశాలలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కార్పోరేషన్ అధికారులు హెచ్చరించారు.