ప్రపంచాన్ని మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్ భయపెట్టింది. దీని ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టిందనుకునే లోపు ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ ముప్పుతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్లను అధికారులు ట్రేస్ చేస్తున్నారు. టి నుండి విదేశాల నుంచి ముఖ్యంగా ఎట్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారి పై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు.
విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. డెల్టా వేరియంటా.. లేక ఒమిక్రాన్ వేరియంట్ అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి వచ్చిన వారిలో 13 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు.
ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా ఒమిక్రాన్ వేరింట్ పై స్పష్టత రావాల్సి ఉంది. రిపోర్ట్స్ వచ్చేందుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు దేశంలోకి ఒమిక్రాన్ థార్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.