గత కొన్ని రోజులుగా దేశాన్ని కలవరపెడుతున్న ఓమిక్రాన్ వేరియంట్.. తాజాగా తెలంగాణకు కూడా వ్యాపించింది. ప్రస్తుతం తెలంగాణ లో కూడా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తెలంగాణలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో కలకలం మొదలైంది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సోకిన ఆ ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని జిల్లాల వైద్యాధికారులకు అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఇక తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,997 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 210 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 213 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 21, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. ఇక ఇప్పటివరకు 6,78,688 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,70,846 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,833 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,009కి పెరిగింది.