నెలల నిండాకుండానే.. ఏకంగా ఐదు నెలల ముందే జన్మించాడు ఆ చిన్నారి. దాంతో ఆ శిశువు బతకడం కష్టమని పెదవి విరిచారు. ఇక ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా ఇంకా పూర్తిగా కళ్లు తెరవని పసికందు.. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయే పరిస్థితి తలెత్తింది. ఆ పసిబిడ్డకు భూమ్మీద ఇంకా నూకలుండటంతో.. ఖననం చేసే ముందు తాను బతికే ఉన్నానని తెలిపాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
మంథని మండలానికి చెందిన ఓ మహిళ 26 వారాల గర్భిణి. ఆమెకు 2022, ఏప్రిల్ 9న డెలీవరీ డేట్ ఇచ్చారు వైద్యులు. కానీ నెలలు నిండకుండానే.. అనగా శనివారం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ క్రమంలో ఆమెను లక్ష్మీనగర్ లోని ఓ వ్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెకు డెలివరీ చేశారు. మగ పిల్లాడు జన్మించాడు. కానీ తక్కువ బరువుతో పుట్టాడు. ఇక ఆ శిశువు బతకడం కష్టమని.. ఏదైనా పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శిశువు శ్వాస తీసుకోవడం లేదని గమనించారు చిన్నారి కుటుంబ సభ్యులు.
ఈ క్రమంలో శిశువు చనిపోయాడని భావించిన బంధువులు.. ఖననం చేయడానికి గోదావరి నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడికెళ్లాక శిశువుపై ఉంచిన గుడ్డను తీసి చూడగా.. చిన్నారిలో కదలికలు కనిపించాయి. వెంటనే శిశువును లక్ష్మీనగర్ లోని మరో పిల్లల ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. తక్కువు బరువుతో పుట్టిన శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. మెరుగైన వైద్యం అందించాలని.. అన్ని వసతులు ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
ఈ క్రమంలో మొదట పురుడు పోసిన ఆస్పత్రి సిబ్బంది.. శిశువును సరిగా పరీక్షించకుండానే.. శ్వాస ఆడటం లేదని తమకు చెప్పడం వల్లే తాము ఖననం చేయడానికి తీసుకెళ్లామని శిశువు బంధువులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, మెరుగైన ఆస్పత్రికి తరలించాలని తాము ముందే చెప్పగా, చనిపోయాడని భావించి బంధువులే శిశువును శ్మశానానికి తీసుకెళ్లారని లక్ష్మీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు వివరించారు. నిర్లక్ష్యం కారణంగా పసిగుడ్డు ప్రాణాలు పోయే ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.