ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరికి పోటెత్తిన వరదలను మరిచిపోకముందే మరోసారి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.. ముఖ్యంగా ముంపు బాధితులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరిగిపోయింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది.
గోదావరి వరద కారణంగా చుట్టుపక్కల గ్రామాలకు ముఖ్యంగా కుక్కునూరు, వేలేరుపాడు గ్రామాల్లో భారీగా నీరు చేరింది. దీంతో రహదారులన్నీ నీటితో మునిగిపోయాయి.. ఎక్కడిక్కడ గ్రామాలకు రాకపోకలు స్థంబించిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంపువాసులకు తాజాగా మరోసారి వరద ముంపు పొంచి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదిలో 12,58,826 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది.. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
ఇదిలా ఉంటే.. మరోసారి గోదావరికి వరద పోటెత్తడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. వరద నీరు ప్రమాదం స్థాయి దాటకముందే.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.