దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కవిత విచారణకు హాజరుకానుంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ వివరాలు..
ఢిల్లీ లిక్కర్ స్కాం ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ తెలంగాణ ఎమ్మెల్సీ నేత, కేసీఆర్ కూతురు కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన సంగతి అందరకీ తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీ చేరిన ఆమె శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈడీ ఎదుట హాజరుకానుంది. ఈ కేసు విషయంలో ఈడీ అధికారులు ఆమెను పలు అంశాల గురించి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కాగా.. ఆయన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారుల పలు కీలక విషయాలు పొందుపరిచారు. ఆ వివరాలు..
సౌత్ గ్రూపులో కవితది కీలక పాత్ర అని తేల్చిన ఈడీ అధికారులు, వీరి మధ్య జరిగిన చాటింగ్ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఈ చాటింగ్‌లో ‘V’ పేరుతో విజయ్ నాయర్, మేడమ్ పేరుతో కవిత, Samee పేరుతో సమీర్ చాటింగ్ చేసినట్టు ఈడీ పేర్కొంది. ఈ స్కాం మొత్తం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో జరిగినట్టు ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ ప్రభుత్వంతో కవితకు స్పష్టమైన రాజకీయ సంబంధాలున్నాయన్న ఈడీ, తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ ఉంటే ముడుపులు ఇస్తామని ఆమె ఆప్ నేతలకు చెప్పారని తెలిపింది.
2021 మార్చిలో విజయ్‌నాయర్‌ను కవిత కలిశారని బుచ్చిబాబు చెప్పారని రిపోర్ట్‌లో ఈడీ వెల్లడించింది. మాగుంట రాఘవకు 32.5శాతం, కవితకు 32.5శాతం… సమీర్ మహేంద్రుకు 35శాతం ఇండో స్పిరిట్స్‌లో వాటా కుదిరిందని, సౌత్ గ్రూప్ ద్వారా వందకోట్లు ఆప్‌కు చెల్లించారని ఈడీ తెలిపింది. ఈ డబ్బు ఢిల్లీకి ఎలా మళ్లించాలన్న దానిపై.. ఐటీసీ కోహినూర్ హోటల్‌లో విజయ్ నాయర్ తరఫున దినేశ్ అరోరా.. అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, అర్జున్ పాండేను కలుసుకుని చర్చించినట్లు ఈడీ తెలిపింది.
ఇదిలావుంటే.. కవితకు బినామీగా చెబుతున్న అరుణ పిళ్లై, ఈడీకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలంటూ ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవలే అరెస్టయిన పిళ్లై.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కవితకు తాను బినామీగా వ్యవహరించానని పిళ్ళై ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఇండోస్పిరిట్స్ కంపెనీలో ఆయనకున్న 32.5 శాతం వాటాలు కవితవేనని ఈడీ విచారణలో అంగీకరించారు. మద్యం వ్యాపారంలో గడించిన లాభాల్లో ఇండోస్పిరిట్స్ కంపెనీ నుంచి పిళ్లై ఖాతాకు రూ.33 కోట్ల మేర బదిలీ చేసినట్లు స్పష్టమైంది. అయితే, కవితను విచారించడానికి ఒక్క రోజు ముందు పిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. అయితే, ఇదంతా బీజేపీ కక్షసాధింపు చర్యలేనని బీఆర్ఎస్ కొట్టి పారేస్తోంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.