రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన దళిత బంధు పథకంలో అబ్దిదారుల అకౌంట్స్ లో డబ్బులు జమ అవుతున్నాయి. దళిత సోదరులు వ్యాపార రంగంలో కూడా ముందంజలో ఉండాలని తెలంగాణ సీఎం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టగా అమలు పరుస్తున్నారు. దీనిపై ఎంత వ్యతిరేకతలు వచ్చినా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తుతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడక్కడా కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడుతున్నాయి. ఒకేసారి వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో లక్షల రుపాయాలు జమ అవుతున్నాయి.. అంతలోనే మాయం అవుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. మరి అకౌంట్లలో నుండి డబ్బులు ఎందుకు వాపస్ వెళుతున్నాయి. గత రెండు మూడు రోజులు అబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన దళిత బంధు డబ్బులు, 10 లక్షల రూపాయలు తిరిగి ప్రభుత్వ ఖాతాకే క్రెడిట్ అవుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు స్కీమ్ కింద ఇటీవల కొందరి అకౌంట్లలో పడ్డ రూ.9.90 లక్షలను ప్రభుత్వం వాపస్ తీసుకుంటోంది. ఈ నెల 6 నుంచే ఒంటరి మహిళలు, వృద్ధుల అకౌంట్లలోని అమౌంట్ డెబిట్అవుతున్నట్లు సెల్ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. కొందరు నిరుపేద కూలీలు, యువకుల ఖాతాల్లోంచి కూడా పైసలు కట్ కావడంతో విషయం బయటకు వచ్చింది. ఒక్క కమలాపూర్ మండలంలోనే 156 మంది అకౌంట్లు ఖాళీ కావడంతో ఆయా దళిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
బ్యాంకు ఆఫీసర్ల వద్ద కూడా డబ్బుల డెబిట్‌కు సంబంధించి సరైన సమధానం లభించడం లేదు.. దీంతో అసలైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు సమాధానం చెప్పకపోవడంతో తిరిగి ప్రభుత్వ అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా వారికి సరైన సమాధానం లభించకపోవడంతో పరేషన్ అవుతున్నారు లబ్దిదారులు. విచిత్రం ఏంటంటే లబ్ధిదారుల అకౌంట్స్‌లలో డబ్బులు జమ అయిన తర్వాత తిరిగి ఖాతాలు ఖాలీ కావడం వెనక మతలబు ఏమిటనేది అంతుపట్టకుండా ఉంది. సీఎం కేసీఆర్ ఆగస్టు 16న నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. స్కీమ్ ప్రారంభించిన రోజే 15 మందికి దళిత బంధు ఇచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇంటింటి సర్వే చేసి, మొత్తం 20,900 దళిత కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు. దీని ఆధారంగా ఒక్కొక్కరి అకౌంట్ లో సాయం జమ చేస్తున్నారు. దళిత బంధు రక్షణ నిధికి రూ .10 వేలు పోను మిగతా రూ .9.90 లక్షలను లబ్ధిదారుల పేరున తీసిన ప్రత్యేక అకౌంట్ లో వేస్తున్నారు . ఇలా ఇప్పటి వరకు 14,400 మంది అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో ఎవైనా తప్పులు దొర్లాయా లేక బ్యాంకు లావాదేవిల్లోనే ఇబ్బందులు ఉన్నాయా అనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.
