గతే ఏడాది దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఎన్నో పురాతన కట్టడాలు.. వంతెనలు కూలిపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్థవ్యస్థమవుతుంది.. ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటారు.. ఈ నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుంటారు.
ఇటీవల భారీ వర్షాల కారణంగా పురాతన కట్టడాలు.. వంతెనలు కూలిపోతున్న విషయం తెలిసిందే. భూకంపాల కారణంగా పాత వంతెనలకు బీటలువారి కుప్పకూలిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు బ్రిడ్జీలు కూలిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా 35 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన పగుళ్లు తేలి ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర స్థితిలో ఉంది. వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ జిల్లా తరోడ గ్రామం వద్ద 35 సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ వంతెనుకు ఇటీవల పగుళ్లు వచ్చాయి. ఈ కారణంతో ఆ వంతెన మెల్లిగా కుంగిపోవడం మొదలైంది. అటువైపు ప్రయాణించాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆ వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో ఉందని స్థానికులు అంటున్నారు. 2018 లో వచ్చిన భారీ వర్షానికి సాత్నాల ప్రాజెక్ట్ గేటు ఎత్తివేయడంతో వంతెనపై వాగు ఉధృతి ఎక్కువగా కొనసాగింది.. దాంతో రోడ్డు కోతకు గురైంది. అప్పటి నుంచి వంతెనకు మెల్లి మెల్లిగా పగుళ్లు రావడం మొదలయ్యాయిన అంటున్నారు. దాంతో వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఆర్అండ్ బీ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. కాకపోతే ఆ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు.
ఆదివారం ఉదయం వంతెన కుంగిపోయి, పెద్ద ఎత్తున పగుళ్లు రావడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దాంతో మరోసారి అక్కడ రాకపోకలు స్తంభించాయి.. వాహనాలను అటు వైపు వెళ్లకుండా పోలీసులు నీరాల మీదుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. కాగా, వంతెన కుంగిపోవడంతో అటుగా ప్రయణించాల్సిన వాహనాలు నిషేదించడంతో అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఇక జైనథ్, బేల మండాలలకు చెందిన ప్రజలు ఆదిలాబాద్ చేరుకోవాలంటే నానా అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ దారిగుండా రావాలంటే ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. త్వరగా కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని.. ప్రస్తుతం ఈ మార్గంలో మరమ్మతులు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.