చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు వెళ్తే వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి.. లేదా వాళ్లు చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తీసుకు వస్తుంది. ఇలాంటి ఘటనలు ఈ మద్య తెలుగు రాష్ట్రంలో ఎన్నో జరిగాయి.
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేం. అప్పటి వరకు మన కళ్ల ముందు సంతోషంగా గడిపిన వారు హఠాత్తుగా మూయడం చూస్తూనే ఉన్నాం. ఈ మద్య సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న విషయం తెలిసిందే.. అప్పటి వరకు ఎంతో యాక్టీవ్ గా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరని అంటారు. ఓ బాలుడు అప్పటి వరకు ఎంతో హ్యాపీగా కేరింతలు కొడుతూ ఊయల ఊగాడు.. చివరికి అదే ఉరితాడైంది. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
హనుమకొండ జిల్లాకు దామెర మండలం ఉరుగొండ గ్రామానికి చెందిన జన్ను సతీష్, కల్పన దంపతుల కుమారుడు యశ్వంత్.. వయసు 8 సంతవ్సరాలు. ఓ ప్రైవేట్ స్కూల్ లో 1 వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఊయల కనిపించింది. సరదాగా ఊయల ఊగాలని ఎక్కాడు.. కొద్ది సేపు సంతోషంగా ఊగాడు. ఊయల దిగే సమయంలో ప్రమాదవశాత్తు అది మెడకు బిగుసుకుంది. అప్పటికే యశ్వంత్ గిల గిల కొట్టుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే తాడును తీసి.. బాలున్ని హనుమకొండ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కొడుకు ఇలా అర్థాంతరంగా మృత్యువడిలోకి వెళ్లిపోతాడని ఊహించలేదని.. ఎనిమిదేళ్లకే నూరేళ్లు నిండిపోయాయా బాబూ అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎంతో ముద్దు ముద్దుగా మాట్లాడూ అందరితో కలివిడిగా ఉండే యశ్వంత్ చనిపోయాడన్న వార్త తెలుసుకొని గ్రామస్థులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. చిన్నారులను ఒంటరిగా ఎక్కడికి పంపకూడదు.. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.. వాళ్లు చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తీసుకు వస్తుందని గతంలో పలు సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.