ఉత్తర్ ప్రదేశ్ లో నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన ఎంపీ, ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనలంగా మారింది. ఈనేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ లో ఎంపీ అసదుద్దీన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ కాల్పుల ఘటన నేపథ్యంలో అసదుద్దీన్‌కి ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఓవైసీ వాహనాలపై దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో తనపై జరిగిన దాడి అంశాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా తనకు కేటాయించిన జెడ్ కేటగిరి భద్రతను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ‘నేను చావుకు భయపడే వాడిని కాను. నాకు ప్రజలే రక్షకులు. నాపై దాడి చేసిన వారిపై ఉపా యాక్ట్ వర్తింపజేయాలి’ అని అసదుద్దీన్ ఓవైసీ కోరారు. దయచేసి తనకు న్యాయం చేయాలని, తనపై కాల్పులు జరిపిన దుండగులను యూఏఈపీ చట్టం కింద బోనులో నిలపాలని కోరారు. అసలు వీళ్లెవరు.. బ్యాలెట్లపై నమ్మకంలేక బుల్లెట్లనే నమ్ముకున్నారా? ఇలాంటి విద్రోహకర శక్తుల ఆటకట్టించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి భద్రత వలయాన్ని కూడా కొందరు ఛేదించుకుని వచ్చిన ఘటనపై స్పందించిన విపక్ష నేతల్లో తాను కూడా ఉన్నానంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఓవైసీ దీర్ఘ ఆయువును ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారిని పట్టుకున్నామని, వాహనాన్ని సీజ్ చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై ఇంకా లోతుగా విచారణ జరుగుతోందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి సోమవారం దీని గురించి పూర్తి వివరణ ఇస్తారన్నారు.