ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ భారతీయులకు షాక్ ఇచ్చింది. ఏకంగా 23 లక్షల అకౌంట్లు బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని అక్టోబర్ నెలకు సంబంధించిన నివేదికలో వెల్లడించింది వాట్సాప్. ఈ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మొత్తంగా 23,24,000 భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. ఇందులో మళ్లీ 8,11,000 వాట్సాప్ ఖాతాలను వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుకోకముందే.. ముందుజాగ్రత్తగా తామే తొలగించినట్లు ఈ సందర్భంగా వాట్సాప్ వెల్లడించింది. ఈ సందర్భంగా వాట్సాప్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఐటీ రూల్స్ ప్రకారమే తాము ఈ చర్యలు తీసుకుని.. అకౌంట్లు బ్యాన్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు సెప్టెంబర్ నెలలో ఇప్పటికంటే ఎక్కువగా.. అంటే సుమారు 26 లక్షల భారతీయ అకౌంట్లను తొలగించింది వాట్సాప్.
గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీకి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. భారత్‌లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తమ నెలవారీ నివేదికలను ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధలను అమల్లోకి వచ్చినప్పటి నుంచి వాట్సాప్.. నకిలీ, స్పామ్, తప్పుడు అకౌంట్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ నెలకు.. లక్షల్లో నకిలీ, స్పామ్, తప్పుడు ఖాతాల్ని బ్యాన్ చేస్తుండటం విశేషం. ఐటీ చట్టానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వాట్సాప్ చెబుతోంది.
ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. దానికి అనుగుణంగా 2022 అక్టోబర్ నెలకు సంబంధించి నెలవారి రిపోర్ట్ అందించాం. ఈ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌లో.. యూజర్ల నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదులు అందాయి.. వాటిపై మేం ఏం చర్యలు తీసుకున్నామనే వివరాలను సవివరంగా పొందుపరిచాం. ఇంకా కొన్ని ఫిర్యాదులు అందకముందే.. వాట్సాప్ ముందస్తుగా చాలా అకౌంట్లను తొలగించింది’’ అని ఈ సందర్భంగా వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
గతంలో.. జులై, ఆగస్టు నెలల్లోనూ వాట్సాప్.. తప్పుడు అకౌంట్లపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. వాట్సాప్‌లో హానికర కంటెంట్ వ్యాప్తి చెందకుండా చూడటమే కాక.. యూజర్ల సేఫ్టీకి సంబంధించి వాట్సాప్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుకుంటూ త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుంది.