డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి వీడియో యాప్స్ బ్యాన్ చేసిన తర్వాత చాలామంది నిరుత్సాహ పడ్డారు. అయితే అలాంటి సమయంలో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. ప్రముఖ యాప్స్ లేకపోవడంతో రీల్స్ కు భారత్ అతి పెద్ద మార్కెట్ గా మారింది.
ఇన్ స్టాగ్రామ్ రీల్స్.. వీటి గురించి తెలియని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఇండియాలో డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ వీడియోల వల్ల చాలా మంది సెలబ్రిటీలు కూడా అయిపోయారు. తమలో ఉన్న టాలెంట్ ని నలుగురికి చూపించుకుని స్టార్లుగా ఎదిగారు. బుల్లితెర, యూట్యూబ్ లలో ప్రస్తుతం సెలబ్రిటీలుగా ఉన్న చాలామంది ఈ యాప్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చినవాళ్లే. అయితే ఆ యాప్స్ ని ఒక్కసారిగా ఇండియాలో బ్యాన్ చేయగానే చాలామంది డీలా పడిపోయారు. కానీ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ఆ వెలితిని పూడ్చిందనే చెప్పాలి. డబ్ స్మాష్, టిక్ టాన్ చేసేవాళ్లంతా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి మళ్లారు. రీల్స్ ద్వారా తమ టాలెంట్ ని ప్రదర్శిస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ రీల్స్ చేస్తున్నారు. వీటి ద్వారా ఫేమస్ కూడా అవుతున్నారు. వేలమంది రీల్స్ ద్వారా కంటెట్ క్రియేట్ చేస్తుంటే.. కోట్లమంది ఆ రీల్స్ ని చూస్తున్నారు. నిజానికి ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి చాలా అడిక్ట్ అయిపోయారు కూడా. ఏ 5 నిమిషాల సమయం దొరికినా కూడా రీల్స్ చూస్తున్నారు. అయితే ఇలా రీల్స్ చూసేవారికి సంబంధించి ఒక రిపోర్ట్ విడుదలైంది. ఈ రిపోర్టు చూస్తే భారత్ లో ఇంతమంది రీల్స్ చూసేవాళ్లు ఉన్నారా అని టెక్ నిపుణులు కూడా ముక్కున వేలేసుకున్నారు.
అత్యధికంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వినియోగిస్తున్న వారి సంఖ్యను దేశాలవారీగా విడుదల చేశారు. ఆ లిస్టులో అన్ని దేశాలకంటే ఇండియా టాప్ ప్లేస్ లో నిలిచింది. భారత్ లో మొత్తం 230.25 మిలియన్ల వినియోగదారులు ఉన్నట్లు వెల్లడించారు. రెండోస్థానంలో 159.75 మిలియన్ల వినియోగదారులతో అమెరికా నిలిచింది. ఇంక వరుసగా.. బ్రెజిల్- 119.45 మిలియన్లు, ఇండోనేషియా- 99.15 మిలియన్లు, రష్యా 63 మిలియన్లతో మొదటి ఐదుస్థానాల్లో నిలిచాయి. ఇంక ఏ వయసు వాళ్లు ఎక్కువగా ఈ రీల్స్ వినియోగిస్తున్నారు అనే విషయాన్ని కూడా వెల్లడించారు.
13-17 మధ్య వయసు కలిగిన వారు 8.5 శాతం, 18 నుంచి 24 ఏళ్ల మధ్యవాళ్లు 30.1 శాతం, 25- 34 ఏజ్ వాళ్లు 31.5 శాతం, 35-44 మధ్య వయస్కులు 16.1, 45-54 మధ్యవారు 8, 55- 64 మధ్య వయసు కలిగిన వాళ్లు 3.6, 65 ఏళ్లు పైబడిన యూజర్లు 2.1 శాతం ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. ఈ నివేదిక చూసిన తర్వాత యువతలో ఈ రీల్స్ పై ఎంత మోజు, క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత భారతదేశంలో యువత సమయాన్ని వృథా చేసుకుంటోంది అంటూ కామెంట్ చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పేరిట భవిష్యత్ పై ఒక క్లారిటీ లేకుండా టైమ్ పాస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.