యువరాజ్ సింగ్.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పేరు. దాదాపు 28 ఏళ తర్వాత టీమిండియా రెండో వన్డే వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం.. యువీ. అయితే అది కేవలం అతని ఆటతోనే సాధ్యం కాలేదు. అతని పోరాటం, అతని త్యాగంతో టీమిండియా వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది.
28 ఏళ్ల తర్వాత టీమిండియా మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు ఎప్పుడో 1983లో ఇండియా వరల్డ్ కప్ నెగ్గింది. మళ్లీ అన్నేళ్ల తర్వాత టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటాయి. కొన్ని వారాలపాటు ఆ విజయం తాలూకు ఆనందాన్ని అంతా ఆస్వాదించారు. దేశానికి వరల్డ్ కప్ అందించాడని టీమిండియా కెప్టెన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. సచిన్ జన్మ సార్థకమైందని.. క్రికెట్ దేవుడిని భుజాలపై మోశారు. టీమ్ మొత్తానికి ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం పట్టారు. కానీ.. వరల్డ్ కప్ నెగ్గిన మూడు నెలలకే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. క్రికెట్ ప్రపంచం మొత్తం షాకైంది. వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలిచిన వ్యక్తికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఈ వార్తతో అంతా షాక్ అయితే యువీ మాత్రం చిరునవ్వులు చిందించాడు. ఎందుకంటే తనకు క్యాన్స్‌ర్ అని వైద్యులు ఇప్పుడు ప్రపంచానికి చెప్పారు. కానీ యువీకి ఆ విషయం వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడే తెలుసు.
వన్డే వరల్డ్ కప్ 2011లో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో వెస్టిండీస్‌తో చెన్నైలో టీమిండియా మ్యాచ్. కెప్టెన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌కు గాయం కారణంగా.. సచిన్ టెండూల్కర్‌తో గౌతమ్ గంభీర్ ఓపెనర్‌గా వచ్చాడు. కానీ.. ఇద్దరు త్వరగానే పెవిలియన్ చేరారు. టీమిండియా 52 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌పై పడింది. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఇద్దరూ ఆడుతూ.. 100 పరుగుల భాగస్వామ్య నమోదు చేశారు. ఇంతలోనే కొండలాంటి మనిషి యువీ కూలిపోయినట్లు కూర్చున్నాడు. నోట్లో నుంచి రక్తం.. అంతే ఒక్కసారిగా అంతా షాక్. అంపైర్ కూడా యువీని ఫస్ట్‌ఎయిడ్ తీసుకోమని కోరతాడు. కానీ.. యువీ మాత్రం దాన్ని లెక్కలేయలేదు. తన లక్ష్యం ఒక్కటే ఇండియాకు వరల్డ్ కప్ అందించాలి, సచిన్‌కు అంకితం ఇవ్వాలి. ఇది మాత్రమే యువీకి కనిపిస్తుంది. దాని కోసం రక్తం కక్కినా బెదరలేదు. రక్తం కక్కుకుంటూనే సెంచరీతో టీమిండియాను గెలిపించాడు.
ఆ తర్వాత కీలకమైన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో పోరులో కూడా యువీ తన విశ్వరూపం చూపించాడు. హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను ఫైనల్ చేర్చాడు. ఆ విజయం తర్వాత యువరాజ్ మోకాళ్లపై కూర్చోని చేసిన సింహాగర్జన ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచి ఉంటుంది. ఇక ఫైనల్లో అందరూ ధోని కొట్టిన చివరి సిక్స్ గురించి మాట్లాడుకుంటారు. కానీ.. ఫైనల్లో యువీ కూడా 21 పరుగులతో నాటౌట్‌గా ఉంటాడు. అసలు టీమిండియా 2011లో వరల్డ్ కప్ గెలిచిందంటే ప్రధాన కారణం యువీనే. ప్రతి మ్యాచ్‌లో రాణించాడు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా.. ప్రాణాంతకమైన క్యాన్సర్ తనను లోలోప తినేస్తుందని తెలిసినా.. యువీ చూపించిన పోరాటంతోనే టీమిండియాకు వరల్డ్ కప్ దక్కింది. బ్యాటింగ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ యువీ వరల్డ్ కప్ అదరగొట్టాడు.
దేశం కోసం వరల్డ్ కప్ గెలవాలనే కసి యువరాజ్‌ను తన ప్రాణాలను సైతం లెక్కచేయనిలేదు. అది ఒక వీరుడికి ఉండే లక్షణం. ప్రాణం పోతున్నా.. రక్తం ధారలై పారుతున్నా.. గెలుపే లక్ష్యంగా సాగడం గొప్ప విషయమే కాదు.. అంతకు మించి. అలాంటి తెగువను, పోరాటాన్ని యువరాజ్ చూపించాడు కనుకే భారత్‌కు వరల్డ్ కప్ దక్కింది. తనకు కాకుండా తన కన్న జూనియర్ ధోనికి కెప్టెన్సీ ఇచ్చారనే విషయాన్ని సైతం మర్చిపోయి కేవలం జట్టు కోసం ప్రాణం పెట్టి ఆడాడు. అయినా.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆడే వ్యక్తికి కెప్టెన్సీ ఉంటే ఎంత లేకుంటే ఎంత. బహుబలిలో కిరీటం ఉన్నా.. భళ్లాలదేవ రాజు కాలేకపోయాడు. కానీ.. బహుబలి కిరీటం లేకపోయినా ప్రజలకు రాజయ్యాడు. అలానే యువీ టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన ఒక ట్రూ ఛాంపియన్. మరి యువరాజ్ చూపించిన పోరాట పటిమపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.