భారతీయులు ఒక్కసారి దేన్నైనా మనది అనుకుంటే.. దాన్ని సచ్చేదాక వదలరు. అంతలా వారు దాని మీద అభిమానం చూపిస్తారు. ఇక క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. క్రికెట్ కు మన దేశంలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.. దానిని ఓ మతంలా అభిమానులు భావిస్తారు. అయితే ఇప్పటి వరకు సినీ హీరోలకే పరిమితమైన కటౌట్ సాంప్రదాయం.. తాజాగా క్రికెట్ లోకి వ్యాపించింది. తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలకు పాలాభిషేకాలు చేసిన సంఘటనలు మనం గతంలో చాలానే చూశాం. కానీ ఆటగాళ్లకు భారీ కటౌట్ లు కట్టిన సందర్భాలు చాలా అరుదు. తాజాగా టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి అభిమానులు భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. టీమిండియా అభిమానులు ముద్దుగా ‘రన్ మెషిన్’ అని పిలుచుకుంటారు. దానికి తగ్గట్లుగానే కింగ్ కోహ్లీ కూడా తన పరుగుల వేటను కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా మునపటి ఫామ్ లోకి వచ్చిన విరాట్.. అద్భుతమైన ఆటతో ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన ఆటగాడు ఫామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. వారి ఆనందానికి.. అభిమానం తోడైంది. ఇంకే ముంది ఆ అభిమానానికి కొండెత్తు కటౌట్ రూపం ఇచ్చారు. అవును విరాట్ కోహ్లీకి తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్ మైదానానికి ముందు విరాట్ కోహ్లీ భారీ కటౌట్ ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కటౌట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే బుధవారం (సెప్టెంబర్ 28) న సౌతాఫ్రికా తో ఈ గ్రౌండ్ లోనే మ్యాచ్ జరగనుంది. అందుకే ఈ భారీ కటౌట్ ను వారు ఏర్పాటు చేశారు. ఇక కటౌట్ ను చూసిన అభిమానులు నెట్టింట తెగ స్పందిస్తున్నారు. “కింగ్ ఆగయా బాహుబలి కటౌట్” అని కొందరు రాయగా.. “ఇది కదా రన్ మెషిన్ కు అసలైన బహుమతి” అని మరికొందరు స్పందించారు. సినిమా హీరోకి ఏ మాత్రం తీసిపోకుండా కటౌట్ ను కట్టారు. ఇది ఇలా ఉండగా.. గ్రీన్ ఫీల్డ్ మైదానం కొన్ని రోజుల ముందు వార్తల్లో నిలిచింది. గ్రౌండ్ కు ఉన్న విద్యుత్ బకాయిలు, వాటర్ బిల్లులు కట్టలేదని విద్యుత్ అధికారులు మైదానానికి కరెంట్ కట్ చేసిన సంగతి మనకు తెలిసింది. మరి ఇప్పటి వరకు ఈ విషయం పై గ్రౌండ్ యాజమాన్యం స్పందించలేదు.
Massive flex of Virat Kohli in front of the Greenfield stadium. pic.twitter.com/eU3ooYamsU
— Johns. (@CricCrazyJohns) September 27, 2022