2021లో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా ట్రోఫీ సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం భారత్‌కు వచ్చింది. అయితే.. అప్పుడు మన ప్రత్యర్థి వల్ల మిస్ అయిన ట్రోఫీ ఇప్పుడు వారి వల్లే దక్కేలా ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మాదాబాద్ వేదికగా జరుతున్న చివరి టెస్టులో ఫలితం తేలకుండానే టీమిండియాకు సూపర్ గుడ్‌న్యూస్ అందింది. ఈ ఏడాది జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది టీమిండియా. ఆస్ట్రేలియాపై చివరి టెస్టు డ్రా దిశగా సాగుతున్నా.. టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం వచ్చేసింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 మధ్య ఇంగ్లండ్‌లోని ఓవెల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ కోసం బిగ్ ఫైట్ జరగనుంది. 2021లో జరిగిన తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి.. ట్రోఫీని దక్కకుండా న్యూజిలాండ్ అడ్డుపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే న్యూజిలాండ్.. టీమిండియా ఫైనల్ చేరేందుకు దోహదపడింది.
అది ఎలాగంటే.. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 ఆరంభానికి ముందు టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆసీస్‌పై 3-1తో లేడా 2-0 తేడాతో సిరీస్ గెలవాల్సిన పరిస్థితి. ఎలాగైనా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలనే డృఢమైన సంకల్పంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. కానీ.. అనూహ్యంగా మూడో టెస్టులో పుంజుకున్న ఆస్ట్రేలియా.. టీమిండియాను చిత్తుగా ఓడించింది. దీంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. టీమిండియాపై మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరగా.. భారత్ మాత్రం ఆసీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులో కచ్చితంగా విజయం సాధించి తీరాల్సిన ఒత్తిడిలో పడింది.
మూడో టెస్టులో తగిలిన ఎదురుదెబ్బతో పాటు స్పిన్ పిచ్‌లపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నాలుగో టెస్టు వేదిక అహ్మాదాబాద్ పిచ్‌ను బ్యాటింగ్ ట్రాక్‌గా రూపొందించారు. దీంతో.. నాలుగో టెస్టులో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ డ్రా అయితే టీమిండియాకు ఎలాంటి ఫలితం ఉండదు. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే.. 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుస్తుంది కానీ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మాత్రం చేరదు. భారత్ ఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవాలి. ఇప్పుడు అదే జరిగింది. రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన శ్రీలంక తొలి టెస్టులో ఓడిపోయింది.
న్యూజిలాండ్‌పై రెండుకు రెండు టెస్టులు గెలిస్తేనే శ్రీలంకకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం ఉండేది. కానీ తొలి టెస్టులోనే ఓడిపోవడంతో లంక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. దీంతో టీమిండియాకు డబ్ల్యూటీసీకి చేరేందుకు అడ్డుగా ఉన్న లంక పక్కకుతప్పుకుంది. ఆస్ట్రేలియాపై 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ దక్కించుకోబోతున్న టీమిండియా.. దాంతో పాటే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సైతం సగర్వంగా చేరింది. జూన్‌లో ఇదే ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడి, 2021లో మిస్ అయిన టెస్టు గదను ఈ సారి ఎలాగైన సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Team India will play WTC final under the leadership of Rohit Sharma on 7th june. We coming. pic.twitter.com/XeDo2lbcD4
— ANSHUMAN🚩 (@AvengerReturns) March 13, 2023