టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై పాక్ ఓడిపోయింది. నరాల తెగ ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచులో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ని క్రికెట్ ప్రేమికులు అస్సలు మర్చిపోరు. ఆ మ్యాచ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నుంచి అభిమానులు మెల్లమెల్లగా బయటకొస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాక్ జట్టు జింబాబ్వేతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ పై రకరకాల సెటైర్స్ కూడా పేలాయి. అదంతా పక్కనబెడితే.. జింబాబ్వే ఇన్నింగ్స్ చాలా విచిత్రంగా సాగింది. ఇప్పుడు ఆ విషయం చర్చనీయాంశమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు బ్యాటింగ్ కు దిగింది. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా లాంటి టాప్ క్లాస్ బౌలర్లని జింబాబ్వే బ్యాటర్లు పవర్ ప్లేలో గట్టిగానే ఎదుర్కొన్నారు. 9 రన్ రేట్ తో పరుగులు చేస్తూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ పవర్ ప్లే పూర్తి కాగానే బింబాబ్వే బ్యాటర్లు తడబడ్డారు. పాక్ బౌలర్లు రెచ్చిపోయారు. అలా వరస విరామాల్లో వికెట్లు తీస్తూ చెలరేగారు.
ఫలితంగా జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్ 31 పరుగులు తప్పించి మిగతా బ్యాటర్లందరూ కూడా స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఒకానొక దశలో 95/3తో బలంగా ఉన్న జింబాబ్వే జట్టు.. కేవలం ఆరు బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. వసీమ్ జూనియర్ 4, షాదాబ్ ఖాన్ 3, హరీశ్ రవూఫ్ 1 వికెట్ తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే జట్టు.. 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసింది. ప్రారంభంలో జింబాబ్వే బ్యాటింగ్ చూస్తే ఎక్కువ స్కోరు చేస్తారేమో అనిపించింది కానీ చివర్లో మాత్రం పాక్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు. ఇంత జరిగినా.. ఈ మ్యాచులో జింబాబ్వే గెలవడం గమనార్హం. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడిచేశారు. ఆఖరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచులో జింబాబ్వే ఒక రన్ తేడాతో విజయం సాధించింది.