ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్‌లో టీమిండియా పరాజయం పాలైంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. సూపర్ 12లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత్ జట్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌ను ఓడించి టీమిండియా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌కు టఫ్ టార్గెట్ ఇచ్చింది. కానీ.. ఇంగ్లండ్ ఓపెనర్లు అద్భుతంగా ఆడి విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లారు.
అయితే.. అనిశ్చితికి మారుపేరైన క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. కానీ.. ఉపఖండంపు దేశాల్లో క్రికెట్ అనేది ఎమోషన్స్‌తో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో విజయాన్ని ఎంతగా ఆస్వాదిస్తారా.. ఓటమిని అంతలా ద్వేషిస్తారు. అదంతా ఆటపై వారికి ఉండే ప్రేమాభిమానుల ప్రతిరూపం. దేశం ప్రాతినిథ్యం వహిస్తుందని.. ఆటను ఆత్మగౌరవంగా భావిస్తారు.. అందుకే కచ్చితంగా గెలిచి తీరాలని బలంగా కోరుకుంటారు. అది నేరవేరకుంటే.. ఆటగాళ్లపై దూషణలకు దిగడం, ప్రత్యర్థిపై మాటల యుద్ధానికి తెరతీస్తుంటారు. కానీ.. ఇవన్నీ సాధారణ క్రికెట్ అభిమానుల వరకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. అంతేకానీ.. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు చాలా హుందాగా వ్యవహరిస్తుంటారు. ఓడినా, గెలిచినా.. స్ఫూర్తి కలిగించాలా తమ స్పందనను వ్యక్త పరుస్తుంటారు.
కానీ.. పాకిస్థాన్ ప్రధాని మాత్రం ఇందుకు చాలా భిన్నంగా స్పందించారు. ఇండియా-ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆయన చేసిన ట్వీట్‌పై పాక్ పైత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక దేశ ప్రధానిగా అత్యున్నత స్థానంలో ఉండి.. ఇలాంటి చీప్ ట్వీట్లు చేయడంపై ఇండియన్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇంతకీ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏం ట్వీట్ చేశారంటే.. ‘అయితే ఈ సండే.. 152/0, 170/0 మధ్య పోటీ అన్నమాట’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే ఇప్పుడు భారతీయ క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియా ఇచ్చిన 152 టార్గెట్‌ను పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి గెలిచింది. ఇప్పుడు ఈ వరల్డ్ కప్‌లో సెమీస్‌లో భారత్ ఇచ్చిన టార్గెట్‌ను ఇంగ్లండ్ కూడా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేజ్ చేసి గెలిచింది.
ఈ రెండు విషయాలను ఇప్పుడు సెమీస్‌లో భారత్ ఓటమి సందర్భంగా ప్రస్తావిస్తూ.. స్వయంగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు. తమ జట్టు ఫైనల్ చేరినందుకు సంతోషం వ్యక్తం చేయడంలో తప్పేంలేదు. కానీ.. గెలుపోటములు సహజమైన ఆటలో ఓ జట్టు ఓటమిని కించపరస్తూ.. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ట్వీట్ చేయడం సరైంది కాదని క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇదే ట్వీట్‌ను ఏ సామాన్య పాకిస్థాన్ అభిమానో చేసి ఉంటే.. ఇంత వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ.. దేశ అత్యున్నత పదవి ప్రధాన మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. టీమిండియాను 10 వికెట్ల తేడా ఓడించిన జట్లు.. ఫైనల్లో తలపడుతున్నాయి. ఓకే.. అలాగే క్రికెట్‌లో పసికూనలుగా పిలువబడే జింబాబ్వే, ఐర్లాండ్ చేతుల్లో ఓడిన జట్లు కూడా ఫైనల్లో తలపడుతున్నాయన్న విషయం మర్చిపోవద్దని పాక్ ప్రధానికి రిప్లైగా కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు.
So, this Sunday, it’s:
152/0 vs 170/0
🇵🇰 🇬🇧 #T20WorldCup
— Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022