కాలానికి తగ్గట్టుగా మనిషి.. మనిషి ఆలోచనలు మారాలి. అలా మారకపోతే ప్రపంచంలో ముందుకు వెళ్ళలేం. ప్రస్తుతం టీమిండియా ఇదే పరిస్థితిలో ఉంది. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై దారుణంగా ఓడిపోయింది. దాంతో ఒక్క ఆటగాళ్లపైనే కాకుండా కోచ్, యాజమాన్యం పై కూడా సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దానికీ ఓ కారణం ఉంది. క్రీడా ప్రపంచంలో మిస్టర్ వాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ టీ20లకు కోచ్ గా ఎందుకు? జట్టు వెంట మెంటర్ గా టెస్టు బ్యాట్స్ మెన్ లక్ష్మణ్ ఎందుకు? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు సగటు క్రీడాభిమానులు. ద్రవిడ్, లక్ష్మణ్ క్రీడా దిగ్గజాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ టీ20 లకు దూకుడైన ఆట, బౌలర్లపై ఎదురుదాడికి దిగే మనస్థత్వం ఉంటేనే నెగ్గుకు రాగలం. ప్రపంచంలో అలాంటి మనస్థత్వం గల ఏకైక డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. అవును ఇప్పుడు అందరు కోచ్ గా సెహ్వాగ్ లాంటి డాషింగ్ బ్యాటర్ అయితే ఇలాంటి మెగా టోర్నీల్లో గెలవగలం అంటున్నారు.
వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ చరిత్రలో అత్యంత డేంజరస్ బ్యాటర్ గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. సోగసైన బ్యాటింగ్, కళాత్మకమైన షాట్స్, అంతకంటే ఎక్కువగా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడటం. టీ20 ల్లో ఇంతకంటే ఏం కావాలి. టెస్టులను టీ20లుగా, వన్డేలను టీ10లు ఆడిన ఘనత వీరేంద్రుడి సొంతం. బౌలర్లను ఆదిలోనే ఊచకోత కోస్తే.. వారు ఆత్మ రక్షణలో పడతారు. దాంతో జట్టు మరింతగా స్కోరు చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ఇదే వీరేంద్రుడి మైండ్ సెట్.. దానికి తగ్గట్లుగానే ఆడతాడు సెహ్వాగ్. మరి అలాంటి మైండ్ సెట్ ఉంటేనే టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో కప్ లు కొట్టగలం. అంతే గానీ రాహుల్ ద్రవిడ్ లాంటి టెస్టు బ్యాటర్ ను కోచ్ గా తెచ్చి బీసీసీఐ తప్పు చేసిందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుందో.. అతడి ఆటకూడా అలాగే ఉంటుంది. ఈ ప్రపంచ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఆడిన విధానం టెస్టు బ్యాటింగ్ ను తలపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్-రోహిత్ శర్మ లు ఈ వరల్డ్ కప్ పవర్ ప్లే లో ఎన్ని రన్స్ చేశారో మనకు తెలుసు. పరుగులు చేయడం పక్కన పెడితే.. ఫాస్ట్ బౌలింగ్ లో భయపడకుండా ఆడటం వారికి గగనం అయ్యింది. పాకిస్థాన్ లాంటి జట్టు ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియా వెంటరన్ బ్యాటర్ మాథ్యూ హెడెన్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుని అద్బుతాలు చేస్తోంది. హెడెన్ బ్యాటింగ్ గురించి మనందరికి తెలిసిందే. అతడు ఎంత దూకుడుగా వ్యవహారిస్తాడో.. బౌలర్ల పై ఎలా దాడికి దిగుతాడో మనం చూసే ఉన్నాం. అలాంటి కోచ్ ఉంటే.. అతడి ఆలోచనలు అలాంటి ఎగ్రసీవ్ నెస్ ఆటగాళ్లలో కూడా వస్తుంది. హెడెన్ పాక్ ఆటగాళ్లలో ఇప్పుడు ఇదే నింపాడు.
ఇక మరో ఫైనలిస్టు ఇంగ్లాండ్ నే తీసుకుంటే న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లామ్ పాఠాలలో రాటుతేలిన ఇంగ్లీష్ ఓపెనర్లు.. పవర్ ప్లేలో ఎలా పరుగులు కొల్లగొడుతున్నారో మనం ఈ ప్రపంచ కప్ లో చూడనే చూశాం. ఈ ప్రపంచ కప్ లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. దీన్ని బట్టే మనం అర్దం చేసుకోవచ్చు. ఏ ఫార్మాట్ కు తగ్గట్లు.. ఆ ఫార్మాట్ ఆటగాడిని కోచ్ గా నియమిస్తే సరైన ఫలితాలు వస్తాయని. అలా అని ద్రవిడ్, లక్ష్మణ్ ల సామర్థ్యాలను తక్కువ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వారు చేసిన పరుగులు, కొల్లగొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. కానీ టెస్టు, వన్డేలకు సరిపోయే వారి ఆలోచనలు.. ఎంత మాత్రం టీ20 లకు పనికి రావన్నది కాదనలేని వాస్తవం. టీ20ల్లో ప్రారంభంలోనే బౌలర్లపై ఎదురుదాడికి దిగితేనే.. వారు తగ్గుతారు పైగా వారు ఒత్తిడికి గురవుతారు. దాంతో తర్వాత వచ్చే బ్యాటర్లు అలవోకగా పరుగులు చేయోచ్చు. ఇప్పటికైనా బీసీసీఐ కళ్ళ తెరిచి టీ20లకు కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ని తీసుకుంటే.. రాబోయే రోజుల్లోనైనా టీమిండియా కప్ లో కొట్టే ఛాన్స్ ఉంటుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.