కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అనుభవంతో ఏకంగా వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లింది టీమిండియా. పైగా జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి హేమాహేమీలు లేరు. పొట్టి ఫార్మాట్‌కు మనోళ్లంతా కొత్త.. అందులోనూ ఏమాత్రం అనుభవంలేని కుర్రాడు ధోని కెప్టెన్. ఇదంతా చూసి క్రికెట్ అభిమానులు కూడా 2007లో సౌతాఫ్రికా వేదికగా ప్రారంభమైన తొలి టీ20 వరల్డ్ కప్‌ను ముందు పెద్దగా పట్టించుకోలేదు. అభిమానులకే కాదు క్రికెట్ నిపుణులకు, మాజీ ఆటగాళ్లకు కూడా టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. జట్టులో ఉన్న ఒకే ఒక్క హోప్ వీరేంద్ర సెహ్వాగ్. టీ20 ఫార్మాట్ రాకముందే వన్డే, టెస్టులను ఒకేలా ఆడే సెహ్వాగ్ పైనే అందరికీ కొద్దొగొప్పొ ఆశలు ఉన్నాయి. మొత్తానికి టీమిండియా తొలి టీ20 వరల్డ్ కప్‌లో అండర్‌డాగ్స్‌లా బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ స్కాట్‌లాండ్‌తో ఉన్నా.. అది కాస్తా వర్షార్పాణం అయింది. ఇక రెండో మ్యాచ్ మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. కుర్రాడు రాబిన్ ఊతప్ప హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను ఆ జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా అర్ధసెంచరీతో రాణించి.. మ్యాచ్‌ను పాక్ వైపు లాక్కున్నాడు. కానీ.. చివరి ఓవర్‌లో 12 రన్స్ అవరసమైన దశలో శ్రీశాంత్ అద్భుతమైన బౌలింగ్‌కు తోడు మంచి ఫీల్డింగ్‌తో మిస్బాను చివరి బంతికి రనౌట్ చేసి భారత్ మ్యాచ్‌ను టై చేసుకుంటుంది. దీంతో అంపైర్లు బౌలౌట్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బౌలౌట్‌లో టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప వరుసగా ముగ్గురు కూడా వికెట్లను హిట్ చేయడం, అటు పాక్ నుంచి అర్ఫత్, ఉమర్ గుల్, అఫ్రిదీ ముగ్గురి ముగ్గురు మిస్ చేయడంతో టీమిండియా 3-0 తేడాతో ఆ మ్యాచ్ గెలుస్తుంది. కానీ.. అసలు ఈ బౌలౌట్‌లో టీమిండియా అంత ఈజీగా గెలవడానికి, పాక్‌ను దారుణంగా ఫెయిల్ అవ్వడం వెనుక ఒక మాస్టర్ బ్రెయిన్ ఉంది. అదే మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని.
అప్పటి వరకు లాంగ్ హెయిర్‌తో హెలికాప్టర్ షాట్లతో అలరించే కుర్ర క్రికెటర్‌గా మాత్రమే ధోని అందరికి తెలుసు. కానీ.. పాక్‌తో బౌలౌట్ తర్వాత ధోని ఒక మాస్టర్ పీస్ అనే విషయం ప్రపంచానికి అప్పుడే తెలిసొచ్చింది. బౌలర్లు వికెట్లను హిట్ చేసేందుకు వచ్చిన టైమ్‌లో ధోని ఒక ప్లాన్ ప్రకారం వికెట్లకు కాస్త దగ్గరగా.. కచ్చితంగా వికెట్లకు వెనకాల మోకాళ్లపై నిల్చున్నాడు. దీంతో మనోళ్లు ముగ్గురు కూడా గురి తప్పకుండా వికెట్లను గిరాటేశారు. కానీ.. పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మాత్రం ఎప్పటిలాగే వికెట్లకు ఆఫ్‌సైడ్ కొంత పక్కను జరిగి, చాలా దూరంలో నిల్చుంటాడు. ఇది పాక్ బౌలర్ల ఫోకస్‌ను పక్కదారి పట్టిస్తుంది. వాళ్లు వికెట్లను వాదిలేసి కమ్రాన్ అక్మల్ వైపు బాల్ వేస్తారు. ఉమర్ గుల్, అర్ఫత్ ఇద్దరూ సేమ్ తప్పిందంతో వికెట్లను మిస్ అవుతారు. ఇక అఫ్రిదీ అయితే ఏకంగా వైడ్‌తో దారుణంగా మిస్ అవుతాడు. ఇక్కడ పాక్ కీపర్ అక్మల్, ధోని మధ్య చిన్న తేడానే ఉంది. అదే టీమిండియాకు టీ20 వరల్డ్ కప్‌లో తొలి విజయం అందించి.. ఆ తర్వాత టీ20 ఛాంపియన్‌గా నిలిపింది.
ఈ విజయంతో ధోనిలోని ఒక కొత్త కోణం ప్రపంచానికి తెలిసొచ్చింది. కెప్టెన్‌గా తాను ఏం చేయగలడో.. ఆ బౌలౌట్‌తో చిన్న ట్రైలర్ చూపించాడు. అక్కడి నుంచి ఇండియన్ క్రికెట్‌లో ధోని శకం మొదలైంది. క్రికెట్‌ను మైండ్ గేమ్‌గా మార్చేశాడు. ఫైనల్‌లో కూడా చివరి ఓవర్‌ను జోగిందర్ శర్మతో వేయించి మిస్బాను బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్‌లో పాక్‌ను బౌలౌట్ చేయించిన ధోని.. ఫైనల్‌లో ఆలౌట్ చేయించాడు. ముఖ్యంగా బౌలౌట్‌లో ఎవరీ అర్థం కాకుండా.. చిన్న ట్రిక్‌తో పాకిస్థాన్‌ను ఎర్రిపప్పలను చేసిన విధానం అయితే.. ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ధోని మాత్రమే ఇలా ఆలోచించగలడేమో అనిపిస్తుంది. అనిపించడం కాదు.. అదే నిజం. ధోని ఒక్కడే అలా ఆలోచిస్తాడు. ప్రపంచ క్రికెట్‌లో తొలి, చివరి సారి జరిగిన ఒకే ఒక బౌలౌట్‌లో టీమిండియా గెలిచింది. సారీ.. ధోని గెలిపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్-పాక్ మధ్య జరిగిన బౌలౌట్‌కు నేటితో 15 ఏళ్లు పూర్తి అయ్యాయి. మరీ ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అప్పుడు ధోని ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే.. నా జీవితం మరోలా ఉండేది!