యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022 పోరులో శ్రీలంక జట్టు ఛాంపియన్ గా అవతరించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్ లాంటి బలమైన జట్లను కూడా అలవోకగా ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇది గడిచిన నెలలోపే శ్రీలంక పరిస్థితి అద్వాన్నంగా తయారయ్యింది. టీ20 ప్రపంచ కప్ పోరులో నిలబడాలంటే(సూపర్-12కు అర్హత సాధించాలంటే) తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో తలకిందులవుతోంది. టోర్నీ తొలి మ్యాచులోనే పసికూన నమీబియా చేతిలో ఓటమి పాలయ్యింది. ఇది చాలదన్నట్టు ఇవాళ యూఏఈతో జరిగిన మ్యాచులో విజయం సాధించడం కోసం నానా తిప్పలు పడ్డారు లంక ఆటగాళ్లు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నచ్చారు. కుశాల్ మెండిస్ (18) ఔటైనప్పటికీ.. ధనంజయ డిసిల్వా (33) జతగా ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (74) చెలరేగి ఆడాడు. ఈ జోడీ జోరు చూస్తే ఆ జట్టు 180 పరుగులు దాటేలాగానే కనిపించింది. అయితే ఈ ఇద్దరు ఔటైన తర్వాత మరే బ్యాటర్ రాణించలేదు. దీంతో శ్రీలంక 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. అందులోనూ నిస్సాంక ఆఖరి వరకూ క్రీజులో ఉండడంతో ఆ మాత్రం స్కోరైనా దక్కింది. ఒకానొక సమయంలో నిస్సాంక షాట్ కొట్టబోయి బ్యాలన్స్ తప్పి కింద పడిపోయాడు. అతని ‘షూ’ కూడా ఊడిపోయింది. అయినా పరుగు మాత్రం ఆపలేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆపై 153 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. శ్రీలంక బౌలర్ల ధాటికి వచ్చినవారు వచ్చినట్లుగా పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు 17.1 ఓవర్లకు 73 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో చమీరా 3, హసరంగ 3, తీక్షణ 2 వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచులో యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్.. హ్యాట్రిక్ వికెట్లు సాధించి రికార్డుల్లో నిలిచాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా మెయ్యప్పన్ రికార్డుకెక్కాడు. మెయ్యప్పన్ కంటే ముందు బ్రెట్ లీ, క్యాంఫర్, వనిందు హసరంగా, కాగిసో రబడా హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉన్నారు.
History – First hattrick in the T20 World Cup 2022. pic.twitter.com/AoLcKagK1i
— Johns. (@CricCrazyJohns) October 18, 2022