ఇండియన్ క్రికెట్ ప్రపంచానికి, వెండితెరకు అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ వేరు వేరు అని చెప్పలేం. ఎందుకంటే.. క్రికెటర్లు హీరోయిన్లను ప్రేమించడం, పెళ్లాడటం లాంటి సంఘటనలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ మధ్యనే ధోనీ సైతం ప్రొడ్యూసర్(ధోనీ ఎంటర్టైన్మెంట్)గా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలోనే వెండితెరపై మెరవనున్నాడన్నది ఆ వార్త సారాంశం.
ధావన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రముఖ కథానాయికలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డబుల్ ఎక్స్‌ఎల్’ సినిమాలో ధావన్ అతిథి పాత్రలో నటించాడట. అందుకు సంబంధించిన ఫొటోను ‘హ్యూమా’ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఇందులో ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయానికొస్తే.. సమాజంలో బొద్దుగా ఉండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంతో సతరమ్ రమానీ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి లావుగా ఉండే అమ్మాయిల్లా కన్పించనున్నారు. ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలోనూ ధావన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు సంగతి తెలిసిందే. ఆ మధ్య అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘రామ్‌సేతు’ సినిమా సెట్‌లో ధావన్ కన్పించాడు. దీంతో ఈ సినిమాలో అతడు నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఆ వార్తలపై సదరు నిర్మాణ సంస్థ ధావన్ నటించట్లేదని వివరణ కూడా ఇచ్చింది. వాస్తవానికి గబ్బర్‌కు నటనపై ఆసక్తి ఎక్కువే. ఖాళీ సమయాల్లో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇక మాజీ ఆటగాళ్ళైన ఇర్ఫాన్ పటాన్, శ్రీశాంత్ లు ఇప్పటికే వెండితెరపై తళుక్కుమన్న విషయం తెలిసిందే.