టీమిండియా అదరగొట్టేసింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం శార్దుల్ ఠాకుర్ కి ఇచ్చారు. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే అలా ఇవ్వడం వెనక పెద్ద రీజనే ఉంది. మరోవైపు ఇదే మ్యాచులో ఇంట్రెస్టింగ్ సీన్ కూడా ఒకటి కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ.. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక బౌలర్ శార్దుల్ ని మ్యాచ్ జరుగుతుండగానే తిట్టేశాడు. ఆ విషయమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్ వేదికగా మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు గిల్ ఎప్పటిలానే సెంచరీతో చితక్కొట్టేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ఫార్మాట్ లో సెంచరీ చేశాడు. వీళ్లిద్దరికీ తోడు చివర్లో హార్దిక్ పాండ్య (54), శార్దుల్ ఠాకుర్ (25) కూడా బ్యాటుతో అలరించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో మన జట్టు 385 పరుగుల భారీ స్కోరు చేసింది.ఇక ఛేదనలో కివీస్ బ్యాటర్లు బలంగానే నిలబడ్డారు. ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఆకట్టుకోగా..ఆ తర్వాత వచ్చిన వారు కూడా మెల్లగా కుదురుకునే ప్రయత్నం చేశారు.
అలాంటి టైంలో బౌలింగ్ చేసిన శార్దుల్ ఠాకుర్.. లైన్ అండ్ లెంగ్త్ మిస్ చేస్తూ కొన్ని బంతులు వేశాడు. దీంతో అతడి దగ్గరకొచ్చిన రోహిత్ శర్మ.. కోప్పడుతూ కనిపించాడు. ఇది జరిగిన కాసేపటికే అంటే.. 26 వ ఓవర్లో వరస బంతుల్లో మిచెల్ (24), లాథమ్ (0) వికెట్లని శార్దుల్ పడగొట్టాడు. ఆ తర్వాత కాసేపటికి నికోలస్ (42)ని కూడా ఔట్ చేశాడు. ఈ క్రమంలోనే కివీస్ బ్యాటింగ్ డౌన్ అయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయారు. దీంతో మ్యాచ్ టీమిండియా సొంతమైంది. అయితే రోహిత్ తిట్టడం వల్లే శార్దుల్.. వికెట్లు తీయడం, ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) January 24, 2023