వెస్టిండీస్‌ను వన్డే, టీ20 సిరీస్‌ల్లో వైట్‌వాష్ చేసి ఇంటికి పంపిన భారత జట్టు ఇప్పుడు శ్రీలంక పనిపట్టనుంది. గురువారం తొలి టీ20తో శ్రీలంకతో సిరీస్ మొదలవనుంది. కాగా ఈ సిరీస్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో కీలకంగా మారింది. కెప్టెన్‌గా ఇప్పటికే సూపర్ హిట్ అయిన రోహిత్‌కు పర్సనల్ రికార్డులు ఊరిస్తున్నాయి. ముచ్చటగా మూడు రికార్డులు రోహిత్ ఖాతాలో ఎప్పుడెప్పుడు పడాలా అని ఎదురుచూస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా, కెప్టెన్‌గా వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలవబోతున్నాడు. దీంతో నేడు జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌పై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లోనే హిట్ మ్యాన్ అదరగొట్టి ఆ మైల్‌స్టోన్స్‌ను చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించడానికి కెప్టెన్ రోహిత్ శర్మ మరో 37 పరుగుల దూరంలో ఉన్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 3263 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. మరో 37 పరుగులు చేస్తే ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (3299) రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 3296 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 34 పరుగులు చేస్తే కనీసం విరాట్ కోహ్లీని దాటి రెండో స్థానంలో ఉంటాడు. శ్రీలకంతో సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు రోహిత్ శర్మ ఆడితే ఆ ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో 122 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ కంటే ముందు ఉన్న పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 124 మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు.
ఇక టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలవాలంటే నేడు శ్రీలంకతో జరగబోయే టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ 63 పరుగులు సాధించాల్సి ఉంది. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ముందు ఉన్నాడు. దీంతో నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 63 రన్స్ చేసి బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా టీ20ల్లో కెప్టెన్‌గా ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 40.73 సగటుతో 937 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువగా ఉంది. కాగా భారత్, శ్రీలంక మధ్య నేటి నుంచి లక్నో వేదికగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. 26, 27వ తేదీల్లో రెండు, మూడో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి రోహిత్ శర్మ ఈ మూడు రికార్డులను శ్రీలంకతో సిరీస్‌లోనే సాధిస్తాడాని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.