136 కోట్ల మందికి పైగా ఉండే భారతదేశంలో.. ఓ క్రికెట్ మ్యాచ్ కి కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయ మార్గం ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు గంగూలీ సారధ్యంలోని బీసీసీఐ ఈ విషయంలో కొత్త అడుగులు వేసింది. సీనియర్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అలాగే ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ల సీరిస్ తలపడే సమయంలో.. శ్రీలంక టూర్ ని ఫిక్స్ చేసింది బీసీసీఐ. పైగా.., ఈ సిరీస్ లో యువ ఆటగాళ్ళకి పెద్ద పీట వేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ విషయంలో గంగూలీ నిర్ణయానికి అన్నీ వైపుల నుండి మద్దతు లభిస్తోంది. అయితే.., శ్రీలంకలో పర్యటించే జట్టుకి రాహుల్ ద్రావిడ్ ని కోచ్ గా ఫైనల్ చేయడంతో ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. నవంబర్ లో జరిగే టి-ట్వంటీ ప్రపంచ కప్ తో కోచ్ గా రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తుంది. సో.., ఈసారి హెడ్ కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రావిడ్ కి కట్టబెట్టాలని గంగూలీ గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. దాదా నిర్ణయాన్ని వ్యతిరేకించే దైర్యం ఎవ్వరూ చేయకపోవచ్చు. కానీ.., ఈ విషయంలో కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. కోచ్ రవిశాస్త్రితో కోహ్లీకి మంచి ర్యాపొ ఉంది. పైగా.., కోహ్లీ దూకుడుకి రవిశాస్త్రి సరిగ్గా సింక్ అయిపోయాడు. ఈ కారణంగానే గతంలో కూడా రవిశాస్త్రికి బాహాటంగా మద్దతు తెలిపాడు కోహ్లీ. గతంలో భారత క్రికెట్ జట్టుకి అనిల్ కుంబ్లేని కోచ్ గా తీసుకు రావాలని సచిన్, గంగూలీ, లక్ష్మణ్ వంటి సభ్యులతో కూడిన కమిటీ నిర్ణయించింది. కానీ.., కోహ్లీ ఈ నిర్ణయానికి అంగీకారం తెలపలేదు. రవిశాస్త్రి కోచ్ గా ఉండాల్సిందే అని పట్టుబట్టాడు. కెప్టెన్ కి ఇష్టం లేకుండా కోచ్ ని మారిస్తే టీమ్ లో విబేధాలు వచ్చే ప్రమాదం ఉండటంతో అప్పుడు అడ్వైజరీ కమీటి వెనక్కి తగ్గింది. ఆ సమయంలో అనిల్ కుంబ్లే అవమానకరమైన రీతిలో కోచ్ రేస్ నుండి తప్పుకోవడం అందరికీ గుర్తే. కట్ చేస్తే ఇప్పుడు కూడా అదే సీన్. కుంబ్లే స్థానంలోకి ద్రావిడ్ వచ్చాడు. మరి.. ఈసారి కోహ్లీ మద్దతు ఎవరికి ఉంటుంది అన్నది అసలు సమస్య. కాకుంటే అప్పట్లో కెప్టెన్ గా కోహ్లీ తప్ప టీమ్ ఇండియాకి మరో ఆప్షన్ లేదు. కానీ.., ఇప్పుడు రోహిత్ రూపంలో కోహ్లీకి గట్టి పోటీ ఉంది. కాబట్టి.. శాస్త్రిని కోచ్ గా పొడిగించమని అడిగే సాహసం కోహ్లీ చేయకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. బీసీసీఐ బాస్ గంగూలీ ఒక్కసారి డిసైడ్ అయితే.., ఇక తిరుగు ఉండదుగా మరి.