టీమిండియాకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. ఆసియా కప్ నుంచి మొదలుపెడితే టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ సిరీస్, ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్ సిరీస్.. మొత్తంగా చూస్తే వరస వైఫల్యాలు టీమిండియాకు శాపంగా మారాయి. అభిమానుల అయితే ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఇక ఏడో ర్యాంకులో ఉన్న బంగ్లా జట్టుపై వన్డే సిరీస్ ఓడిపోవడం టీమిండియాని అభిమానించే ప్రతిఒక్కరినీ షాక్ కు గురిచేసింది. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు డైరెక్ట్ గానే భారత జట్టు, ఆటగాళ్లపై కౌంటర్స్ వేస్తున్నారు. సీనియర్ ఆటగాళ్ల తీరుపైనే మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అత్యంత సక్సెస్ ఫుల్ టీంగా ఎదిగిన టీమిండియా.. 2022లో మాత్రం వైఫల్యాలని చూస్తోంది. టీ20 ప్రపంచకప్ సెమీస్ నుంచి భారత్ నిష్క్రమించిన తర్వాత.. ఈ విషయాన్నిఇక్కడే మర్చిపోయి, వచ్చే ఏడాది స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ పై దృష్టి సారించాలని అభిమానులు రిక్వెస్ట్ చేశారు. కానీ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లో జరిగిన వన్డే సిరీసులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ధావన్, కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా సిరీస్ కోల్పోవడం.. క్రికెట్ ప్రేమికులకు షాకింగ్ గా అనిపించింది. అయితే ఇలా జరగడానికి కారణాన్ని మాజీ క్రికెటర్ మదన్ లాల్ బయటపెట్టారు. మరీ ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లపై మండిపడ్డారు.
‘గత మూడేళ్ల రికార్డు పరిశీలిస్తే.. సీనియర్ ఆటగాళ్లు ఎన్ని సెంచరీలు చేశారు. వయసు పెరగడం అనేది ఈ వైఫల్యానికి ఓ కారణం కావొచ్చు. కానీ వారు ఎక్స్ పీరియెన్స్ ఆటగాళ్లు కదా. టాపార్డర్ బ్యాటర్లు సరిగా ఆడకపోతే మ్యాచులు గెలవలేం. సడన్ గా భారత్ బౌలింగ్ విధానం దారుణంగా బలహీనపడింది. అసలు వికెట్లు కూడా తీయలేరేమో అనేంతలా ఆడుతున్నారు. ఇతర దేశాలన్నీ కూడా ఏ ఫార్మాట్ కు ఆ ఫార్మాట్ లో డిఫరెంట్ ప్లేయర్స్ తో ఆడిస్తుంటే.. భారత్ మాత్రం ఎందుకు ఇలా చేయడం లేదు? అలానే ఇప్పుడున్న జట్టు.. అసలు టీమిండియాలానే కనిపించడం లేదు. దేశం కోసం ఆడలనే కసి, పట్టుదల ఆటగాళ్లలో పూర్తిగా లోపించింది.’ అని మదన్ లాల్ విమర్శించారు. బహుశా ఐపీఎల్ లో గెలవడం, ఓడిపోవడం వల్లే మన ఆటగాళ్లకు బాగా అలవాటైపోయింది. అందువల్లే దేశం తరఫున ఆడుతూ గెలవాలనే కసి కనిపించట్లేదని పలువురు నెటిజన్స్ కూడా టీమిండియాని విమర్శిస్తున్నారు.