ఐపీఎల్ సృష్టికర్త, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. సుస్మితాతో తాను డేట్ చేస్తున్నట్లు లలిత్ మోదీ ప్రకటించిన తర్వాత నుంచి వారిపై పలు కోణాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చే వార్తలు, విమర్శలు, ట్రోలింగ్ పై లలిత్ మోదీ స్పందించాడు. కాస్త ఘాటుగానే స్పందించాడని చెప్పాలి. బీసీసీఐతో పాటు అటు మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు.
తన మాజీ భార్య, సుస్మితా సేన్, నెల్సన్ మండేలా, ప్రధాని మోదీ, అమిత్ షా, తన చిన్ననాటి ఫొటోలు షేర్ చేస్తూ ఓ భారీ మెసేజ్ ను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా.. ఇన్ స్టాగ్రామ్ లేనివారి కోసం ఇమేజ్ టెంప్లేట్ తో ట్విట్టర్ లోనూ తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి వస్తున్న వార్తలు, విమర్శలకు సుదీర్ఘంగా సమాధానం, కౌంటర్ ఇచ్చాడు.
ఆ మెసేజ్ లో ముఖ్యంగా బీసీసీఐపై లలిత్ మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. “నేను అవినీతి ఆరోపణలతో దేశం విడిచి పారిపోయానంటూ మాట్లాడుతున్నారు. ఏ కోర్టు నన్ను దోషిగా తేల్చింది? నేను సృష్టించి దేశానికి కానుకగా ఇచ్చిన అద్భుతాన్ని(ఐపీఎల్ ని ఉద్దేశిస్తూ) దేశంలో మరెవరైనా చేశారా చెప్పండి. భారతదేశంలో వ్యాపారం చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. 2008లో నేను చెప్పినట్లు ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన లీగ్ అయ్యింది. అప్పట్లో నవ్విన వాళ్లు, ఇప్పుడు నవ్వుతున్న వాళ్లు ఉన్నారు. కానీ, ప్రపంచానికి తెలుసు నేను ఒంటరిగానే ఐపీఎల్ ని సృష్టించానని.”
బీసీసీఐ గురించి మాట్లాడుతూ.. “బీసీసీఐలో ఉన్న ఏ కోతీ ఒక్క సాయం కూడా చేయలేదు. రోజుకి 500 డాలర్ల కోసం అంతా అక్కడికి వచ్చారు. నాపై మీరు అవినీతి ఆరోపణలు చేస్తే పట్టించుకుంటాననుకుంటున్నారా? నేను డైమెండ్ స్పూన్ తో పుట్టిన వాడిని. నేను ‘గుజర్మల్ మోదీ’ పెద్దమనవడిని అని మీరంతా మర్చిపోయుంటారు. నేను ఎప్పుడూ లంచం తీసుకోలేదు.. నాకు ఆ అవసరం కూడా లేదు.”
“నేను నవంబర్ 29న నా పుట్టినరోజు నాడు బీసీసీఐలో చేరాను. అప్పుడు బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 40 కోట్లు మాత్రమే. నాపై బ్యాన్ విధించే సమయానికి బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 47,680 కోట్లుగా ఉంది. అంతదూరం రావడానికి నాకు ఏ ఒక్క వ్యక్తి సహాయం చేయలేదు. అసలు ఎక్కడ మొదలు పెట్టాలో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు అంతా పెద్ద హీరోల్లా నటిస్తున్నారు” అంటూ లలిత్ మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.