ప్రస్తుతం అన్ని క్రీడా దేశాల దృష్టి మెుత్తం 2023 వరల్డ్ కప్ మీదే ఉంది. ఈసారి ఎలగైనా కప్ కొట్టాలని అన్ని దేశాలు అస్త్రశస్త్రాలు రడీ చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి నుంచే అందుకు తగ్గట్లుగా ప్రణాళికలను సైతం సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది టీమిండియా. ఎందుకంటే ఈ ఏడాది వరల్డ్ కప్ జరగబోయేది భారత్ లోనే కావడం.. టీమిండియాకు అనుకూలాంశంగా మరబోతుంది అనడంలో సందేహం లేదు. అయితే వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో కేవలం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడటం సరికాదని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. కేవలం ఒక్కరిద్దరు మాత్రమే వరల్డ్ కప్ గెలవలేరు అని చెప్పుకొచ్చాడు.
టీమిండియా.. గత కొంతకాలంగా ఐసీసీ మెగాటోర్నీల్లో అంతగా రాణించలేదు. వరుస వైఫల్యాలతో మెగా టోర్నీల్లో ఓటములను చవిచూస్తూ.. తీవ్ర విమర్శలపాలైంది. ఈ క్రమంలోనే మరికొన్ని నెలల్లో 2023 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. 2023లో భారత జట్టు వరల్డ్ కప్ గెలవాలి అంటే కేవలం ఒక్కరు, ఇద్దరు సీనియర్ బ్యాటర్లపైనే ఆధారపడటం మంచిది కాదని హెచ్చరించాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ..”వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలు గెలవాలి అంటే కేవలం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఇద్దరు, ముగ్గురు సీనియర్లపైనే ఆధారపడటం సరైన పద్దతి కాదు. ప్రపంచ కప్ లు గెలవాలి అంటే జట్టులో కనీసం ఐదారుగురు మ్యాచ్ విన్నర్లు ఉండాలి. అప్పుడే జట్టు కప్ లు కొట్టగలదు” అని చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్.
ఇక ఆటగాళ్లతో పాటుగా టీమ్ మేనేజ్ మెంట్, కోచ్, సెలెక్టర్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కపిల్ అన్నారు. ఇలాంటి టైమ్ లో ఆలోచించకూడదని సూచించాడు. ఇక ఆటగాళ్లు ఎప్పటికి వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి.. జట్టు ప్రయోజనాలకే మెుగ్గు చూపాలని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో మ్యాచ్ విన్నర్లతో పాటుగా.. వరల్డ్ కప్ గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారని కపిల్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో జట్టుపై పూర్తిగా నమ్మకం ఉంచాలన్నారు. అలా కాకుండా కేవలం విరాట్, రోహిత్ లా ఇద్దరు, ముగ్గురిపై ఆధారపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఈ సందర్బంగా హెచ్చరించాడు కపిల్ దేవ్.