భారత మహిళలు మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమవుతున్నారు. దక్షిణాఫ్రికా గడ్డ మీద ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇటీవల సౌతాఫ్రికాలోనే నిర్వహించిన అండర్-19 మహిళల కప్‌ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే పొట్టి ప్రపంచ కప్‌ను చేజిక్కించుకునేందుకు సీనియర్ విమెన్స్ టీమ్ రెడీ అవుతోంది. 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ కప్ జరగనుంది. ఇందులో దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.
ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 12న పాక్‌తో ఆడనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్ సన్నద్ధత, పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. తాము చాలా పరిణతి చెందామని తెలిపింది. ‘మాకు ఏది ముఖ్యమో తెలుసు. గత నెలలో జరిగిన తొలి అండర్-19 వరల్డ్ కప్‌లో ఇండియా విక్టరీ కొట్టింది. ఇప్పుడు సీనియర్ జట్టు దాన్ని రిపీట్ చేయాలని కోరుకుంటోంది. అండర్-19 కప్ చూసి మేం స్ఫూర్తి పొందాం. మంచి ప్రదర్శన కనబర్చేందుకు కావాల్సిన స్ఫూర్తినిచ్చారు. వారి విజయం క్రికెట్‌ను కెరీర్‌గా చేపట్టేందుకు చాలా మంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపింది’ అని హర్మన్‌ప్రీత్ వ్యాఖ్యానించింది.
కాగా, సీనియర్ మహిళల టీ20 క్రికెట్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు పన్నెండు సార్లు తలపడ్డాయి. అందులో 10 మ్యాచుల్లో భారత్ గెలుపొందగా.. రెండిట్లో మాత్రమే దాయాది జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య కామన్‌వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో పొరుగు దేశాన్ని చిత్తుగా ఓడించింది. మరి.. వరల్డ్ కప్ తొలిపోరులో పాకిస్థాన్‌ను టీమిండియా మట్టికరిపిస్తుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.