క్రికెట్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రానే వచ్చింది. ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు పొట్టి క్రికెట్ ప్రపంచకప్ నిర్వహించనున్నారు. టీమిండియా మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు ప్రసారమవుతాయి.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ప్రత్యర్థులు దాదాపు రెండేళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ వేదికగా తలపడనున్నారు. అక్టోబర్ 24న భారత్-పాక్ ఉండబోతోంది. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ ఐదుసార్లు తలపడ్డాయి. ప్రతిసారి టీమిండియాదే పైచేయి. ఈసారి గ్రూప్ దశలోనే భారత్-పాక్ నాలుగుసార్లు తలపడనున్నాయి.
అక్టోబర్ 17న గ్రూప్-బి నుంచి ఆతిథ్య ఒమన్, పపువా న్యూగినియా మ్యాచ్‌తో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభంకానుంది. అదేరోజు సాయంత్రం మ్యాచ్‌లో స్కాట్లాండ్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఆ తర్వాత రోజు గ్రూప్ ఏ నుంచి ఐర్లాండ్ – నెదర్లాండ్స్, శ్రీలంక – నమీబియా ఢీకొట్టనున్నాయి. అసలైన సూపర్ 12 మ్యాచ్‌లు అక్టోబరు 23 నుంచి మొదలవుతాయి. నవంబర్ 10, 11, తేదీల్లో సెమీఫైనల్, నవంబరు 14న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు సెమీ ఫైనళ్లు, ఫెనల్ మ్యాచ్‌లకు రిజర్వు డేలు ఉన్నాయి. అబుదాబిలో నవంబర్ 10న తొలి సెమీస్, దుబాయ్‌లో 11న రెండో సెమీస్ జరగనున్నాయి. నవంబరు 14 ఆదివారం, దుబాయ్ వేదికగా ఫైనల్ పోరు ఉండనుంది.