ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. IPL ను రోల్ మోడల్ గా తీసుకుని ఇప్పటికే కొన్ని దేశాలు లీగ్ లు స్టార్ట్ చేశాయి. మరికొన్ని దేశాలు ఈ టీ20 లీగ్ లను ప్రారంభించాలని సన్నాహకాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా సైతం టీ20 లీగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ లీగ్ విజయవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ కమిషనర్ , దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ పలు ఆసక్తికర చర్చకు తెరలేపాడు. మాకు అవకాశం ఉంటే తప్పకుండా మహేంద్ర సింగ్ ధోనిని సౌతాఫ్రికా టీ20 లీగ్ కు తీసుకొస్తామని అన్నాడు. అందుకు సంబంధించిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోమని పేర్కొన్నాడు.
మహేంద్ర సింగ్ ధోని.. రిటైర్ మెంట్ ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా గానీ ధోనిపై ఫ్యాన్స్ కు అభిమానం మాత్రం తగ్గడంలేదు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం అయ్యే ఐపీఎల్ కు సన్నద్ధం అవుతున్నాడు తలైవా. అందుకు సంబంధించి ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టేశాడు ధోని. ఈ క్రమంలోనే ధోని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దక్షిణాఫ్రికా టీ20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్. ధోని లాంటి ఆటగాడు టీ20 లీగుల్లో ఆడాలని ప్రతీ ఫ్రాంఛైజీ కోరుకుంటుంది, అలాంటి ప్లేయర్ లీగ్ కే పేరుతీసుకొస్తాడు అని గ్రేమ్ స్మిత్ అన్నాడు. ఇక అవకాశాలు ఉంటే ధోనిని తప్పనిసరిగా సౌతాఫ్రికా టీ20 లీగ్ కు తీసుకొస్తానని స్మిత్ పేర్కొన్నాడు. ధోని లాంటి దిగ్గజాలతో కలిస్తే మా విలువ మరింత పెరుగుతుంది. ధోనిలో ఉండే నాయకత్వ లక్షణాలు మా యంగ్ ప్లేయర్ల, టీ20 లీగ్ ను ఓ మెట్టు పైకి ఎక్కిస్తుందని మేం భావిస్తున్నాం అని స్మిత్ పేర్కొన్నాడు.
అదీకాక బీసీసీఐతో కలిసి పనిచేస్తూనే ఉంటాం.. బీసీసీఐను మేం ఎంతో గౌరవిస్తాం కూడా, ప్రపంచ క్రికెట్ బోర్డులో భారత క్రికెట్ బోర్డుది కీలక పాత్ర అని ప్రశంసించాడు. ఇలాంటి బోర్డు నుంచి మేం చాలా నేర్చుకుంటూనే ఉంటాం అంటూ గ్రేమ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ధోని పరిస్థితి వేరేగా ఉంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని అందరు భావిస్తున్నారు. ఎందుకంటే 41 సంవత్సరాలు దాటిన మిస్టర్ కూల్ మరికొన్ని రోజులు క్రికెట్ ఆడతాడు అని మనం భావించలేం. అయితే ఐపీఎల్ ఫ్రాంఛైజీలే సౌతాఫ్రికా టీ20 లీగ్ లో టీమ్ లను కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో గ్రేమ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. మరి ధోని సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఆడుతాడా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.